బాలీవుడ్ డ్రగ్స్ కేసు.. బుల్లితెర నటి అబిగెయిల్ పాండే, ఆమె ప్రియుడి ఇంట్లో ఎన్‌సీబీ సోదాలు

23-09-2020 Wed 17:58
NCB Interrogates TV Actors Sanam Johar and Abigail Pande
  • బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు పాకిన డ్రగ్స్ మహమ్మారి
  • విచారణకు హాజరైన అబిగేల్ పాండే, సనం జోహార్
  • కీలక విషయాలు రాబట్టిన అధికారులు

డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అల్లుకుపోయింది. నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతితో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారంలో పలువురు ప్రముఖుల పేర్లు బయటకు రావడం సంచలనమైంది.

 స్టార్ హీరోయిన్లు అయిన దీపికా పదుకొణే, శ్రద్ధాకపూర్, సారా అలీఖాన్, రకుల్ ప్రీత్‌సింగ్, దియామీర్జా నుంచి తాజాగా నమ్రతా శిరోద్కర్ వరకు రోజుకో పేరు వెలుగులోకి వస్తూ ప్రకంపనలు రేపుతుండగా తాజాగా, బుల్లితెర ప్రముఖ నటి అబిగెయిల్ పాండే, ఆమె ప్రియుడు, కొరియోగ్రాఫర్ సనం జోహార్ నివాసాల్లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సోదాలు నిర్వహించింది.

సోదాల అనంతరం విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. ‘నాచ్ బలియే’ వంటి ప్రముఖ షోలలో పాల్గొని పాప్యులర్ అయిన అబిగెయిల్, సనం జోహార్ జంట ఎన్‌సీబీ ఆదేశాలతో ఈ ఉదయం విచారణకు హాజరైంది. మాదకద్రవ్యాల సరఫరా, డీలర్లు తదితర అంశాలపై అధికారులు వారి నుంచి వివరాలు రాబట్టినట్టు తెలుస్తోంది.