డ్రగ్స్ కేసు.. రకుల్ ప్రీత్, దీపికా పదుకొణే సహా నలుగురు హీరోయిన్లకు సమన్లు!

23-09-2020 Wed 17:53
Rakul Preet Deepika Padukone Shraddha Kapoor Sara summoned in drugs case
  • బాలీవుడ్ ని షేక్ చేస్తున్న డ్రగ్స్ వ్యవహారం
  • విచారణలో పలువురి పేర్లను వెల్లడించిన రియా
  • రకుల్, దీపికతో పాటు శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్ లకు సమన్లు

హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు చివరకు మొత్తం ఫిలిం ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. కేసు విచారణలో ఊహించని విధంగా డ్రగ్స్ మాఫియాతో లింకులు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే హీరోయిన్ రియా చక్రవర్తి, ఆమె సోదరుడితో పాటు పలువురిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు అరెస్ట్ చేశారు. విచారణలో పలువురు సినీ సెలబ్రిటీల పేర్లను రియా బయటపెట్టింది. అనంతరం కొందరి పేర్లు మీడియాలో వచ్చాయి.

తాజాగా నలుగురు బాలీవుడ్ హీరోయిన్లకు ఎన్సీబీ సమన్లు జారీ చేసింది. వీరిలో దీపికా పదుకొణే, రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్ ఉన్నారు. వీరందరూ కూడా విచారణకు హాజరు కావాలని ఎన్సీబీ ఆదేశించింది. ఈ చర్యతో బాలీవుడ్ ఉలిక్కిపడింది. రానున్న రోజుల్లో మరికొందరు సెలబ్రిటీలకు సమన్లు అందే అవకాశం ఉంది. మరోవైపు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ పేరు కూడా వినిపించిన సంగతి తెలిసిందే.