ఆయనతో కలసి నటిస్తున్నాను అని తెలియగానే ఎగిరి గంతేశా: నివేదా థామస్

23-09-2020 Wed 14:59
Rajinikanth is a friendly person says Niveda Thomas
  • రజనీకాంత్ తో నటించడం నా అదృష్ణం
  • ఆయన చాలా చురుకుగా ఉంటారు
  • అందరితో స్నేహపూర్వకంగా ఉంటారు

టాలీవుడ్ లో పలు విజయవంతమైన చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది నివేదా థామస్. తమిళ పరిశ్రమలో సైతం తనకంటూ ఒక ప్రత్యేకతను నివేద సాధించింది. ఈ రెండు ఇండస్ట్రీలతో పాటు తన మాతృభాష మలయాళంలో సైతం వరుస ఆఫర్లతో ఆమె బిజీగా ఉంటోంది. దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ తో కూడా నటించే అవకాశాన్ని సైతం పొందింది. దీనిపై ఆమె మాట్లాడుతూ, రజనీతో నటించడం తన అదృష్టమని చెప్పింది. 'దర్బార్' చిత్రంలో రజనీ కూతురుగా నటించబోతున్నాననే విషయం తెలియగానే ఎగిరి గంతేశానని తెలిపింది.

తన ట్విట్టర్ పేజ్ లో ఆమె స్పందిస్తూ... రజనీ చాలా చురుకుగా ఉంటారని కితాబిచ్చింది. సహ నటీనటులతో మాట్లాడుతూ, ఆయన ఎప్పుడూ సంతోషంగా ఉంటారని చెప్పింది. తాను తొలిరోజు షూటింగ్ కు హాజరైనప్పుడు రజనీకాంత్ అన్న మాటలు తనకు ఆశ్చర్యాన్ని కలిగించాయని... 'ఈ అమ్మాయేనా? ఈమె నటించిన సినిమాలు చాలా చూశాను. బాగా యాక్ట్ చేస్తుంది' అని రజనీ చెప్పారని  తెలిపింది. అందరితో ఆయన ఎంతో స్నేహపూర్వకంగా ఉంటారని చెప్పింది. ఆయనతో నటిస్తే ఎంతో గుర్తింపు వస్తుందని తెలిపింది.