ఆ పదాలను జనాలకు పరిచయం చేసింది జగన్, విజయసాయిరెడ్డే: నక్కా ఆనందబాబు

23-09-2020 Wed 14:36
Jagan introduced quid pro quo to people says Nakka Anand Babu
  • వెంకన్నపై విశ్వాసం ఉన్నప్పుడు డిక్లరేషన్ పై జగన్ సంతకం చేయాలి
  • సంతకం చేయడం ఇష్టం లేనప్పుడు తిరుమలకు ఎందుకు వెళ్లాలి?
  • ఓటు వేసిన దళితులపై ఏపీలో దాడులు చేస్తున్నారు

తప్పుడు ఆరోపణలతో, అసత్య ప్రచారంతో టీడీపీపై బురదచల్లేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేత నక్కా ఆనందబాబు విమర్శించారు. డిక్లరేషన్ ఇవ్వకుండానే తిరుమల వెంకన్న వద్దకు ముఖ్యమంత్రి జగన్ వెళ్తున్నారని... తద్వారా హిందువుల మనోభావాలను దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. వెంకన్నపై నమ్మకం ఉందని సంతకం పెట్టడం ఇష్టం లేనప్పుడు తిరుమలకు వెళ్లడం ఎందుకని ప్రశ్నించారు.

ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పుడు నారా లోకేశ్ మంత్రిగానే లేరని... అలాంటప్పుడు రూ. 2 వేల కోట్ల అవినీతిని ఆయన ఎలా చేస్తారని ఆనందబాబు దుయ్యబట్టారు. దళితుల్లో 80 శాతం మంది జగన్ పార్టీకే ఓటు వేశారని... దానికి ప్రతిఫలంగా దళితులపై దాడులు జరుగుతున్నాయని, శిరోముండనాలు చేస్తున్నారని, హత్యలకు తెగబడుతున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీపై అవినీతి బురద చల్లేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని... మనీలాండరింగ్, క్విడ్ ప్రోకో, ఇన్సైడర్ ట్రేడింగ్ వంటి పదాలను జనాలకు పరిచయం చేసింది జగన్, విజయసాయిరెడ్డేనని విమర్శించారు.