సజ్జల రామకృష్ణారెడ్డీ.. మీలాగ చంద్రబాబు ఎప్పుడూ అవినీతి చొక్కా తొడగలేదు: వర్ల రామయ్య

23-09-2020 Wed 13:54
Varla Ramaiah fires on Sajjala Ramakrishna Reddy
  • చంద్రబాబు సెక్యులరిజాన్ని అనుసరించారు
  • మీ శల్యసారథ్యం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించింది
  • డిక్లరేషన్ పై జగన్ ఓ ప్రకటన చేయాలి

వైసీపీ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై టీడీపీ నేత వర్ల రామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. మీ శల్యసారథ్యం ఇప్పటికే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని అన్నారు. తమ అధినేత చంద్రబాబు అనుక్షణం సెక్యులరిజాన్ని అనుసరించారని చెప్పారు. దివంగత ప్రధాని వాజ్ పేయితో కలిసినా, ఆ తర్వాత బీజేపీతో ఉన్నా... 'సెక్యులరిజాన్ని అనుసరిస్తేనే'  అనే కండిషన్ తోనే  ఉన్నారని అన్నారు. ప్రభుత్వానికి మీరు ఇస్తున్న సలహాలన్నీ కాళ్ల బేరం దగ్గరే ఆగిపోయాయని ఎద్దేవా చేశారు. సజ్జల గారూ... మీ మాదిరి చంద్రబాబు ఎప్పుడూ అవినీతి చొక్కా తొడగలేదని అన్నారు. అంతేకాదు... 'మీకు అర్థమవుతోందా సజ్జల గారూ?' అంటూ ప్రశ్నించారు.

మరోవైపు జగన్ ను ఉద్దేశించి మాట్లాడుతూ, తిరుమల బ్రహ్మోత్సవాలకు మీ రాక రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిందని... ఈ నేపథ్యంలో మతసామరస్యాన్ని దృష్టిలో పెట్టుకుని డిక్లరేషన్ పై మీరు ఒక ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. మనది సెక్యులర్ రాష్ట్రమని... హైందవ ధర్మానికి గౌరవం ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో ప్రశాంతతను కాపాడాలని విన్నవించారు.