paripoornananda: కొడాలి నాని అన్ని విషయాలను సరిగ్గా తెలుసుకుని మాట్లాడాలి: మండిపడ్డ పరిపూర్ణానంద

  • అన్యమతస్థులు ఇవ్వాల్సిన ‘డిక్లరేషన్’పై నాని వ్యాఖ్యలు సరికాదు
  • ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి
  • ధర్మాన్ని కాపాడడానికి మేము పోరాడతాం
  • నాకు హిందూత్వం తప్ప మరేదీ అవసరం లేదు
paripoornananda slams kodali nani

తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకోవాలంటే అన్యమతస్థులు ఇవ్వాల్సిన ‘డిక్లరేషన్’పై ఏపీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై స్వామి పరిపూర్ణానంద స్పందించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ధర్మాన్ని కాపాడడానికి తాము పోరాడతామని చెప్పారు. తనకు హిందూత్వం తప్ప మరేదీ అవసరం లేదని చెప్పారు.  

దేవాలయాల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని అన్నారు. మంత్రి నాని చేసిన వ్యాఖ్యలు ఏపీ సీఎ జగన్‌కు వినిపిస్తున్నాయా? అని ఆయన ప్రశ్నించారు. జగన్ ఈ విషయంపై స్పందించకపోతే ఆ వ్యాఖ్యలను ఆయనే చేయించారని భావించాల్సి వస్తుందని చెప్పారు. శ్రీవారి దర్శనానికి వెళ్లే వారు తప్పని సరిగా ‘డిక్లరేషన్’ ఇవ్వాల్సిందేనని అన్నారు.

తిరుమల గురించి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎన్నడూ లేదని చెప్పారు. వివాదాలను మరింత పెంచేలా నాని వ్యాఖ్యలు ఉన్నాయని ఆయన తెలిపారు. వైసీపీకి గత ఎన్నికల్లో 151 సీట్లు వచ్చాయని, వాటిలో 149 స్థానాలు హిందువులు ఓట్లు వేస్తేనే వచ్చాయని చెప్పారు. కేవలం హిందూ దేవాలయాల గురించే కొందరు నేతలు మాట్లాడుతున్నారని, ఆ హక్కు వారికి లేదని అన్నారు. కొడాలి నాని అన్ని విషయాలను సరిగ్గా తెలుసుకుని మాట్లాడాలని చెప్పారు.

తిరుమలలో మొత్తం 42 పాయింట్లతో డిక్లరేషన్ రూపొందించారని ఆయన గుర్తు చేశారు. అన్యమతస్థులు అక్కడికి వెళ్తే డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని తెలిపారు. తిరుమలపై నాని చేసిన వ్యాఖ్యలు దారుణమని ఆయన చెప్పారు. దేవుళ్ల గురించి మాట్లాడే స్థాయి ఆయనకు లేదని చెప్పారు. అన్ని దేవాలయాలు వివాదాల నుంచి బయటకు రావాలని ఆయన చెప్పారు. దేవాలయాలు ప్రభుత్వ అధీనంలో ఉండకూడదని ఆయన అన్నారు. వెంకటేశ్వర స్వామితో ఢీ కొట్టిన వారు ఏమైపోయారో అందరికీ తెలుసని అన్నారు. రాజ్యాంగం కూడా చదువుకోకుండా నాని మంత్రి అయిపోయారని, అది మన దౌర్భాగ్యమని చెప్పారు.
     

More Telugu News