హైదరాబాదులో 'వకీల్ సాబ్' షూటింగ్ షురూ!

23-09-2020 Wed 12:48
Pawans Vakeel Saab shoot starts in Hyderabad
  • ఇప్పటికే చాలా షూటింగ్ జరుపుకున్న 'వకీల్ సాబ్'
  • తాజాగా హైదరాబాదు పరిసరాల్లో షూటింగ్ నిర్వహణ
  • వచ్చే నెల నుంచి షూటింగులో పవన్ కల్యాణ్
  • సంక్రాంతికి విడుదల చేసే ప్రయత్నాలు

లాక్ డౌన్ కారణంగా నిర్మాణంలో వున్న సినిమాలు, నిర్మాణం పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైన సినిమాలు ఆర్థికంగా చాలా నష్టపోయాయి. ఇక గత ఐదారు నెలల నుంచీ షూటింగులు బంద్ కావడంతో నిర్మాణంలో వున్న చిత్రాలు ఇప్పుడు మెల్లగా షూటింగులు మొదలుపెడుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని చిత్రాలకు ఆర్టిస్టుల డేట్స్ సమస్య కూడా ఉత్పన్నమవుతోంది.

ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ హీరోగా వేణు శ్రీరాం దర్శకత్వంలో రూపొందుతున్న 'వకీల్ సాబ్' చిత్రం షూటింగ్ లాక్ డౌన్ కి ముందే చాలావరకు పూర్తయింది. ఇక మరికొన్ని రోజుల షూటింగ్ మాత్రం మిగిలివుంది. దీంతో ప్రస్తుతం హైదరాబాదు పరిసరాల్లో ఈ సినిమా షూటింగ్ చేస్తున్నారు. ఈ చిత్రీకరణలో కథానాయిక అంజలి, ఇతర నటీనటులు పాల్గొంటున్నారు.

అయితే, పవన్ కల్యాణ్ మాత్రం వచ్చే నెలలో ఈ సినిమా షూటింగులో జాయిన్ అవుతారని అంటున్నారు. శ్రుతిహాసన్, నివేద థామస్ లు కూడా అప్పుడే షూటింగులో పాల్గొంటారని తెలుస్తోంది. హిందీలో వచ్చిన 'పింక్' చిత్రం ఆధారంగా ఈ చిత్రాన్ని తెలుగులో దిల్ రాజు, బోనీ కపూర్ కలసి నిర్మిస్తున్నారు. సంక్రాంతికి దీనిని విడుదల చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.