ఎంజీఆర్‌ వేషధారణలో విజయ్ పోస్టర్లు.. మండిపడుతున్న అన్నా డీఎంకే నేతలు

23-09-2020 Wed 11:35
vijay posters in tamilnadu
  • త్వరలో తమిళనాడు  అసెంబ్లీ ఎన్నికలు
  • కొన్ని నెలలుగా విజయ్ పోస్టర్లు
  • తాజాగా విళుపురంలో దర్శనం
  • కాబోయే సీఎం  అంటూ క్యాప్షన్లు

సినీనటుడు విజయ్‌ రాజకీయ రంగ ప్రవేశం చేయాలంటూ ఆయన అభిమానులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయాలంటూ మరోసారి పోస్టర్లు దర్శనమివ్వడం అలజడి రేపుతున్నాయి. ఎందుకంటే విజయ్‌ను ఎంజీఆర్‌ వేషధారణతో చూపుతూ ఈ పోస్టర్లు వెలిశాయి. కొన్ని నెలలుగా విజయ్ పోస్టర్లు ఏదో ఒక చోట కనపడుతుండడం గమనార్హం.

తాజాగా, విళుపురం జిల్లాల్లో ఆయన పోస్టర్లు కనపడ్డాయి. కొన్ని రోజుల ముందు మధురై, తేని, నీలగిరి వంటి ప్రాంతాల్లో అభిమానులు పోస్టర్లు అంటించారు. అయితే, ఎంజీఆర్‌ వేషధారణలో విజయ్ ఉండడం పట్ల అన్నాడీఎంకే నేతలు మండిపడుతున్నారు. ఎంజీఆర్‌ వేషధారణతో పోస్టర్లు వేసుకున్నంత మాత్రాన నేతలు ఎవ్వరూ ఎంజీఆర్‌ కాలేరని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వెలిసిన పోస్టర్లపై ప్రజల సంక్షేమం, విద్యార్థుల సమస్యల పరిష్కారం, యువతకు ఉద్యోగాల కోసం రాష్ట్రం ఎదురు చూస్తున్న కాబోయే సీఎం విజయ్‌ అంటూ పేర్కొన్నారు.