చాలా రోజుల తరువాత... రూ. 50 వేల దిగువకు 10 గ్రాముల బంగారం ధర!

23-09-2020 Wed 11:18
10 Grams Gold Price Down to Below 50 Thousands
  • రూ. 405 తగ్గిన బంగారం ధర
  • రూ. 49,976కు పది గ్రాముల ధర
  • కిలో వెండి ధర రూ 59,323

బంగారం ధరల పతనం కొనసాగింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో పది గ్రాముల బంగారం ధర చాలా రోజుల తరువాత రూ. 50 వేల దిగువకు వచ్చింది. అమెరికా డాలర్ బలపడుతూ రావడం, ఆరు వారాల గరిష్ఠానికి డాలర్ చేరడంతోనే బంగారం విక్రయానికే ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఎంసీఎక్స్ లో అక్టోబర్ ఫ్యూచర్స్ బంగారం ధర నేడు రూ. 405 తగ్గి రూ. 49,976కు చేరుకుంది. ఇదే సమయంలో డిసెంబర్ ఫ్యూచర్స్ కు సంబంధించి, వెండి ధర కిలోకు రూ. 1,890 పడిపోయి రూ. 59,323కు చేరుకుంది.  ఇక స్పాట్ మార్కెట్లో ఓ దశలో వెండి ధర రూ. 61,990 వరకూ వెళ్లినా, చివరకు పడిపోవడవం గమనార్హం. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఔన్స్ బంగారం ధర 0.8 శాతం పడిపోయి 1,892 డాలర్లకు చేరుకుంది. వెండి ధర 2 శాతం పతనమై 24 డాలర్లకు చేరింది.