Sasikala: శశికళ ముందస్తు విడుదల లేనట్టే... స్పష్టం చేసిన కర్ణాటక జైళ్ల శాఖ!

  • శశికళ విడుదలపై స.హ చట్టం కింద ప్రశ్న
  • అక్రమాస్తుల కేసులో సెలవులు వర్తించవన్న కర్ణాటక జైళ్ల శాఖ
  • విడుదల వచ్చే సంవత్సరం జనవరిలోనే
No Early Release for Sasikala

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత అక్రమాస్తుల కేసులో దోషిగా నిరూపితమై, ప్రస్తుతం కర్ణాటకలోని పరప్పన అగ్రహార జైల్లో శిక్షను అనుభవిస్తున్న శశికళ, ముందస్తుగానే విడుదల కాబోరని ఆ రాష్ట్ర జైళ్ల శాఖ స్పష్టం చేసింది. ఆమెకు పడిన శిక్ష పూర్తయిన తరువాత, వచ్చే సంవత్సరం జనవరిలోనే విడుదల అవుతారని పేర్కొంది.

కాగా, 2017 ఫిబ్రవరి నుంచి ఆమె శిక్షను అనుభవిస్తుండగా, సత్ప్రవర్తన కారణంగా అక్టోబర్ లో విడుదల అవుతారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఓ సమాచార హక్కు కార్యకర్త ఆమె విడుదలపై కర్ణాటక జైళ్ల శాఖకు లేఖ రాయగా, అటువంటిదేమీ జరుగబోదని స్పష్టమైంది.

2021 జనవరి 27న ఆమె విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని, సహ చట్టం కింద నరసింహమూర్తి అనే వ్యక్తి రాసిన లేఖకు జైళ్ల శాఖ బదులిచ్చింది. ఆమెకు చెందాల్సిన సెలవు రోజులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే, ఈ నెలాఖరులో లేదా వచ్చే నెలలోనే తమ నేత జైలు నుంచి విడుదల అవుతారని శశికళ అనుచరులు ప్రచారం చేస్తుండగా, జైళ్ల శాఖ ఈ మేరకు సమాధానం ఇవ్వడం గమనార్హం. అవినీతి నిరోధక చట్టం కింద శిక్షను అనుభవిస్తున్న వారికి సెలవు దినాలు వర్తించబోవని స్పష్టం చేసింది. యావజ్జీవ శిక్ష పడిన ఖైదీలకు మాత్రమే సెలవులు వర్తిస్తాయని వెల్లడించింది.

More Telugu News