2015 నుంచి 58 దేశాల్లో పర్యటించిన ప్రధాని మోదీ... ఖర్చు రూ.517 కోట్లు

22-09-2020 Tue 21:24
Central minister tells Rajyasabha on Modi foreign visits
  • రాజ్యసభలో ప్రశ్నకు జవాబిచ్చిన కేంద్ర మంత్రి
  • మోదీ పర్యటనలతో ఎంతో ప్రయోజనం కలిగిందని వివరణ
  • దేశాలతో సంబంధాలు బలోపేతమయ్యాయని వెల్లడి

ప్రధాని నరేంద్ర మోదీ అధికారం చేపట్టాక విదేశాంగ విధానానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు.  ఆయన పర్యటించిన దేశాల సంఖ్యే మోదీ విధానానికి నిదర్శనం. 2015 నుంచి మోదీ ప్రధాని హోదాలో 58 దేశాల్లో పర్యటించారు. అందుకైన ఖర్చు రూ.517.82 కోట్లు. రాజ్యసభలో వచ్చిన ఓ ప్రశ్నకు విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వి.మురళీధరన్ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

ప్రధాని మోదీ అత్యధికంగా అమెరికా, రష్యా, చైనా దేశాల్లో ఐదేసి సార్లు పర్యటించారని వివరించారు. అంతేకాకుండా, జర్మనీ, ఫ్రాన్స్, సింగపూర్, యూఏఈ, శ్రీలంక దేశాలకు కూడా వెళ్లారని తెలిపారు. ప్రధాని పర్యటనల్లో కొన్ని బహుళ దేశ పర్యటనలు కాగా, కొన్ని ద్వైపాక్షిక పర్యటనలని వివరించారు. చివరిసారిగా ప్రధాని బ్రెజిల్ లో పర్యటించి బ్రిక్స్ దేశాల సదస్సులో పాల్గొన్నారని తెలిపారు. అదే నెలలో ఆయన థాయ్ లాండ్ లోనూ పర్యటించినట్టు వెల్లడించారు.

ప్రధాని పర్యటనల వల్ల ఆర్థిక సంబంధాలు బలోపేతం అయ్యాయని, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక, రక్షణ, సహకార రంగాల్లో ఆయా దేశాలతో పటిష్ట సంబంధాలు ఏర్పడ్డాయని వివరించారు.