చిరంజీవి సెట్స్ కి వచ్చేది ఇక అప్పటి నుంచేనా!

22-09-2020 Tue 20:48
Update on Chiranjeevis latest flick Acharya
  • మళ్లీ మొదలైన సినిమా షూటింగులు 
  • ఈ పరిస్థితుల్లో రిస్క్ వద్దంటున్న చిరంజీవి  
  • ఇక నవంబర్ నుంచి 'ఆచార్య' షూటింగ్
  • వచ్చే ఏడాది వేసవికి విడుదల ప్లానింగ్

యంగ్ హీరోలకు దీటుగా మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకదాని తర్వాత మరొకటి చేసేలా.. వరుసగా పలు చిత్రాలను ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'ఆచార్య'. అపజయం అంటూ ఎరుగని ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఇది తెరకెక్కుతోంది. లాక్ డౌన్ కి ముందు ఈ చిత్రం షూటింగ్ చాలావరకు జరిగింది. కరోనా నేపథ్యంలో అందరిలాగానే ఈ చిత్రం షూటింగును కూడా ఆపేశారు.

ఇప్పుడు కొవిడ్ నిబంధనలు పక్కాగా పాటిస్తూ షూటింగులు చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఒక్కొక్కరు మళ్లీ సెట్స్ కి వెళ్లడానికి రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో 'ఆచార్య' షూటింగ్ ఎప్పటి నుంచి మళ్లీ జరుగుతుందనే కుతూహలం మెగా అభిమానుల్లో వుంది. అయితే, తాజా సమాచారాన్ని బట్టి చిరంజీవి ఇప్పట్లో షూటింగ్ చేయడానికి ఇష్టపడడం లేదని తెలుస్తోంది. మరో రెండు నెలల తర్వాతే షూటింగ్ చేద్దామని, ప్రస్తుత పరిస్థితులలో రిస్క్ తీసుకోవడం మంచిది కాదని దర్శక నిర్మాతలకి ఆయన స్పష్టం చేశారట.

దీంతో 'ఆచార్య' షూటింగును నవంబర్ రెండో వారం నుంచి కానీ, మూడో వారం నుంచి కానీ నిర్వహించడానికి నిర్ణయించారట. చిరంజీవి సరసన కాజల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఇక వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేసేలా ప్లానింగ్ జరుగుతోంది. ఇదిలావుంచితే, 'ఆచార్య' తర్వాత చిరంజీవి నటించే 'వేదాళం', 'లూసిఫర్' రీమేక్ చిత్రాల ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మరోపక్క జరుగుతున్నాయి.