అల్లు అర్జున్ ను కలిసేందుకు 250 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన వీరాభిమాని

22-09-2020 Tue 16:08
Youth walked for two hundred and fifty kilometers to meet Allu Arjun
  • మాచర్ల నుంచి హైదరాబాదుకు పాదయాత్ర
  • ఈ నెల 17న బయల్దేరిన అభిమాని
  • నేడు హైదరాబాద్ చేరిక

సినీ తారల పట్ల సామాన్యుల్లో ఉండే అభిమానం, ఆరాధన అంతాఇంతా కాదు. కొందరు వీరాభిమానులు తమకిష్టమైన తారల కోసం గుడులు కూడా కట్టిన సందర్భాలున్నాయి. తాజాగా అల్లు అర్జున్ వీరాభిమాని ఒకరు 250 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం విశేషం అని చెప్పాలి.

గుంటూరు జిల్లా మాచర్ల మండలం కంభంపాడు గ్రామానికి చెందిన పి.నాగేశ్వరరావు అనే యువకుడు అల్లు అర్జున్ ను గంగోత్రి సినిమా నుంచి అభిమానిస్తున్నాడు. అయితే బన్నీని కలవాలనేది అతని కోరిక. గతంలో అనేకసార్లు ప్రయత్నించినా వీలు కాలేదు. దాంతో మాచర్ల నుంచి హైదరాబాద్ కు కాలినడకన వస్తే బన్నీ తనను గుర్తిస్తాడని నాగేశ్వరరావు భావించాడు.

అనుకున్నదే తడవుగా ఈ నెల 17న మాచర్లలో పాదయాత్ర ప్రారంభించి ఇవాళ్టికి హైదరాబాద్ చేరుకున్నాడు. చేతిలో అల్లు అర్జున్ ప్లకార్డుతో కనిపించిన ఆ యువకుడ్ని ఓ పాత్రికేయుడు పలకరించగా తన వివరాలు తెలిపాడు. తన పాదయాత్రను బన్నీ గుర్తించి కలిసే అవకాశం ఇస్తాడని భావిస్తున్నానని నాగేశ్వరరావు తెలిపాడు.