పొద్దున లేస్తే అయ్యాకొడుకులకు అబద్ధాలే!: ఎంపీ అరవింద్ విసుర్లు

22-09-2020 Tue 15:26
BJP MP Arvind slams CM KCR and his son KTR
  • వ్యవసాయ బిల్లులో లేనిది ఉన్నట్టు చెబుతున్నారని ఆగ్రహం
  • రైతులను మభ్యపెడుతున్నారని వ్యాఖ్యలు
  • ప్రజలు వీళ్లను తన్నేందుకు తయారవుతున్నారని వెల్లడి

బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లపై ధ్వజమెత్తారు. పరిపాలన చేసుకోకుండా అయ్యాకొడుకులు పొద్దున లేస్తే అబద్ధాలు చెబుతుంటారు అంటూ విమర్శించారు. వ్యవసాయ బిల్లులో లేనిది ఉన్నట్టు చెబుతూ రైతులను మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.

"ఇలాంటి రాజకీయాలు చేసుకుంటూ గద్దెనెక్కారు వీళ్లు. తెలంగాణ ప్రజలను మోసం చేశారు. ఇవాళ వీళ్లిద్దరినీ తెలంగాణ ప్రజలు తన్నేందుకు తయారవుతున్నారు. మంచి చేయడం ఎలాగూ నీకు మీ అయ్యకు చేతకాదు... కనీసం అబద్ధాలు చెప్పుకోవడం అయినా మానండి" అంటూ వ్యాఖ్యానించారు.

తెలంగాణకు 1400 వెంటిలేటర్లు కేటాయిస్తే ఇప్పటివరకు వాటిని వినియోగించింది లేదని విమర్శించారు. కరోనా చికిత్సలో దేశంలోనే తెలంగాణ తీసికట్టుగా ఉందన్న విషయం అర్థమవుతోందని పేర్కొన్నారు. కేసీఆర్ కు, కేటీఆర్ కు పాలన చేతకాదన్న విషయం దేశం మొత్తం కోడై కూస్తోందని, పేపరు, చానల్ ఏర్పాటు చేసుకుని అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ కూర్చున్నారని మండిపడ్డారు.