ఇంట్లో ఉంటే ఏ దేవుడ్నైనా పూజించుకోవచ్చు... బయటకొస్తే అన్ని మతాలను గౌరవించాలి: భూమా అఖిలప్రియ

22-09-2020 Tue 15:01
Bhuma Akhila Priya comments on declaration issue
  • డిక్లరేషన్ అంశంపై స్పందించిన అఖిలప్రియ
  • ఆలయాలపై దాడులు పెరిగిపోతున్నాయంటూ వ్యాఖ్యలు
  • ప్రజలకేం రక్షణ కల్పిస్తారంటూ విమర్శలు

తిరుమల డిక్లరేషన్ అంశం ఏపీ రాజకీయ పక్షాల మధ్య తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీఎం జగన్ ఈ నెల 23న తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు వెళుతుండడంతో, టీటీడీ డిక్లరేషన్ పై సంతకం పెడతారా లేదా అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ వ్యవహారంపై టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ స్పందించారు. మంత్రి కొడాలి నాని డిక్లరేషన్ అంశంలో ఇష్టానుసారం మాట్లాడుతున్నారని విమర్శించారు.

ఇంట్లో ఉన్నప్పుడు ఏ దేవుడిని అయినా పూజించుకోవచ్చని, అందులో ఎవరూ అభ్యంతరపెట్టరని, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బయటికొచ్చినప్పుడు అన్ని మతాలను గౌరవించాలని అన్నారు. ఏపీలో దేవాలయాలపై దాడులు చేస్తూ అరాచకం చేస్తున్నారని, ఇవాళ ఆలయాలు, రేపు మసీదులు, ఆపై చర్చిలపై దాడులు జరుగుతాయని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు. అయినా దేవుళ్లకే రక్షణ కల్పించలేకపోతే రాష్ట్రంలో ప్రజలకు ఏం రక్షణ ఇస్తారని అఖిలప్రియ ప్రశ్నించారు.

ఆలయాలపై దాడులకు పాల్పడుతున్న ముఠాను పట్టుకోవాలని, ప్రభుత్వానికి చేతకాకపోతే కేంద్రం ఒక బృందాన్ని ఏర్పాటు చేసి దాడులపై విచారణ జరిపించాలని అన్నారు. ఇలాంటి దాడులు ఏ సీఎం హయాంలోనూ జరగలేదని ఆరోపించారు.