డ్రగ్స్ కేసు.. కర్ణాటక మాజీ మంత్రి కుమారుడిపై లుకౌట్ నోటీసులు

22-09-2020 Tue 14:57
CCB issues lookout notice to former Karnataka ministers son
  • ఆదిత్య అల్వాపై నోటీసులు జారీ చేసిన సీసీబీ
  • అన్ని ఎయిర్ పోర్టులను అలర్ట్ చేసిన అధికారులు
  • పలువురు సినీ, టీవీ ఆర్టిస్టులకు సమన్లు

కర్ణాటక మాజీ మంత్రి జీవరాజ్ అల్వా కుమారుడు ఆదిత్య అల్వా కోసం సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కన్నడ సినీ పరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారంపై సీసీబీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ డ్రగ్స్ తో ఆదిత్య అల్వాకు కూడా సంబంధాలు ఉన్నాయని తేలడంతో ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. అయితే, ఆయన ఆచూకీ తెలియడం లేదు. అల్వా ఇండియాలోనే ఉన్నాడని... అయితే, అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి గుర్తు తెలియని ప్రదేశంలో దాక్కున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇదే సమయంలో దేశం నుంచి పారిపోయేందుకు కూడా అవకాశాలు ఉన్నాయనే అనుమానాలతో ముందస్తు  జాగ్రత్తగా ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దేశంలోని అన్ని ఎయిర్ పోర్టులను అలర్ట్ చేశామని సీసీబీ అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు ఈ కేసులో భాగంగా పలువురు సినీ, టీవీ ఆర్టిస్టులతో పాటు కొందరు క్రీడాకారులకు కూడా సమన్లు జారీ అయినట్టు తెలుస్తోంది. అయితే వీరి అరెస్టులు మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. ఇంకోవైపు ఇప్పటి వరకు 13 మందిని సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 7 మంది కోసం గాలిస్తున్నారు.