Bonda Uma: వెంకటేశ్వరస్వామిని రాజకీయాలకు వాడుకుంటే పతనమైపోతారు: బోండా ఉమ

  • కొడాలి నాని వ్యాఖ్యలపై మండిపడ్డ ఉమ
  • మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చట్టాల గురించి తెలుసుకోవాలని వ్యాఖ్య
  • వైసీపీ పాలన అవినీతిమయమని విమర్శ
Sajjala havnt given a single advice to govt so far says Bonda Uma

తిరుమలలోకి అన్యమతస్థులు ప్రవేశించడానికి డిక్లరేషన్ తో ఏం పని? అంటూ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు విమర్శలపాలైన సంగతి తెలిసిందే. ఎక్కడా లేని రూల్స్ తిరుమలలోనే ఎందుకున్నాయని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేత బోండా ఉమ మాట్లాడుతూ కొడాలి నానిపై మండిపడ్డారు. ప్రపంచంలో ఎక్కడా లేని దేవస్థానమే తిరుమల అని... ఈ విషయాన్ని ఆయన తెలుసుకోవాలని అన్నారు. మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చట్టాల గురించి తెలుసుకోవాలని చెప్పారు. వెంకటేశ్వరస్వామిని రాజకీయాలకు వాడుకుంటే పతనమైపోతారని హెచ్చరించారు.

16 నెలల వైసీపీ పాలనలో అవినీతి, దోపిడీ తప్ప మరేమీ లేదని ఉమ ఆరోపించారు. అమరావతిలో భూములు కొనకూడదని ఏదైనా చట్టం ఉందా? అని ప్రశ్నించారు. ఇన్సైడర్ ట్రేడింగ్ కి అర్థమేమిటో కూడా కేబినెట్ సబ్ కమిటీకి తెలియదని ఎద్దేవా చేశారు.

నిజాయతీగా పని చేసిన అచ్చెన్నాయుడిని అక్రమ కేసులో ప్రభుత్వం ఇరికించిందని... అవినీతి పరుడైన ఓ మంత్రి బెంజ్ కారులో తిరుగుతున్నాడని అయ్యన్నపాత్రుడు మీడియా సాక్షిగా చెప్పినా ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదని మండిపడ్డారు. ప్రభుత్వ సలహాదారుడిగా నెలకు రూ. 3 లక్షల జీతం తీసుకుంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వానికి ఉపయోగపడే ఒక్క సలహా అయినా ఇచ్చారా? అని అడిగారు. విశాఖలో వన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని... దమ్ముంటే దీనిపై విచారణ జరిపించాలని ఉమ ఛాలెంజ్ చేశారు.

More Telugu News