Narendra Modi: దాడి చేసిన వారికే చాయ్ ఇచ్చేందుకు వెళ్లిన గొప్పవారు మీరు: రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పై మోదీ ప్రశంసలు

  • నిన్నటి నుంచి 8 మంది ఎంపీల నిరసన
  • పలకరించేందుకు వెళ్లిన డిప్యూటీ ఛైర్మన్ 
  • దేశమంతా అభినందిస్తోందన్న నరేంద్ర మోదీ
Modi Praises Harivansh Gesture to Protested MPs

నిన్న రాత్రంతా 8 మంది ఎంపీలు పార్లమెంట్ ముందున్న పచ్చిక బయళ్లలో కూర్చుని నిరసనలు తెలపడం, ఈ ఉదయాన్నే రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్, వారి వద్దకు వెళ్లి టీ ఆఫర్ చేయగా, ఎంపీలు దాన్ని తిరస్కరించిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.

హరివంశ్ కు మద్దతుగా నిలిచిన మోదీ, "ఇటీవల తనను అవమానించి, ఆపై దాడి చేసిన వారికి చాయ్ ఇచ్చేందుకు స్వయంగా వెళ్లారు. తన పెద్ద మనసుతో వారు ధర్నా చేస్తున్న ప్రాంతానికే వెళ్లిన హరివంశ్, తనలోని గొప్పతనాన్ని చూపారు. దేశమంతా ఆయన్ను ఇప్పుడు అభినందిస్తోంది. వారితో నేను కూడా చేరుతున్నాను" అని అన్నారు.

కాగా, తాము ఇదే ప్రాంతంలో నిరవధిక నిరసనను తెలియజేయనున్నామని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ మీడియాకు వెల్లడించారు. ఎనిమిది మంది ఎంపీలు రాత్రంతా అక్కడే ఉండగా, వారి అనుచరులు దిండ్లు, దుప్పట్లు, రెండు ఫ్యాన్లు, మస్కిటో కాయిల్స్ తదితరాలను సమకూర్చారు. ఇక, ఈ ఉదయం నుంచి వారికి సంఘీభావం తెలిపేందుకు పలువురు విపక్ష నేతలు వచ్చారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, మాజీ ప్రధాని దేవెగౌడ, సమాజ్ పార్టీకి చెందిన జయా బచ్చన్, కాంగ్రెస్ నేతలు అహ్మద్ పటేల్ తదితరులు వారికి మద్దతు పలికారు.

ఇక, మరో కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్, వారితో పాటు దాదాపు నాలుగు గంటలు కూర్చుని, ఈ నిరసనకు పార్టీ మద్దతునిస్తోందని తెలిపారు. నిరసన తెలియజేస్తున్న వారంతా ఇంటి నుంచి భోజనం తెప్పించుకునే తిన్నామని పేర్కొన్న డెరిక్, తమలోని రుపిన్ బోరెన్, ఎలమారమ్ కరీమ్ లు 65 ఏళ్లకు పైబడి, మధుమేహంతో బాధపడుతున్నారని, వారికి మందులు కూడా తెప్పించామని అన్నారు. ముందు జాగ్రత్తగా ఓ అంబులెన్స్ ను కూడా సిద్ధంగా ఉంచామని అన్నారు.

తాము దేశంలోని ప్రజలందరికీ ఆహారాన్ని అందిస్తున్న రైతుల తరఫున నిలబడి పోరాడుతున్నామని ఆప్ ఎంపీ, నిరసనల్లో పాల్గొంటున్న సంజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. సభలో సరిపడినంత బలం లేకుండానే, అప్రజాస్వామికంగా మోదీ ఈ బిల్లులను ఆమోదింపజేసుకున్నారని మండిపడ్డారు. బిల్లులను తెచ్చే ముందు రైతులను సంప్రదించలేదని ఆరోపించారు.

More Telugu News