BSE: నిమిషాల వ్యవధిలో నేడు మార్కెట్ భారీ పతనం... రూ. 2 లక్షల కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు!

  • సోమవారం నాడు 800 పాయింట్లకు పైగా నష్టం
  • నేడు మరో 400 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్
  • దాదాపు అన్ని కంపెనీలూ నష్టాల్లోనే
Huge Loss in Stock Market

భారత స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజూ భారీగా పతనమైంది. నిన్న 800 పాయింట్లకు పైగా పడిపోయిన బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక సెన్సెక్స్, ఈ ఉదయం మరింతగా దిగజారింది. సెషన్ ఆరంభమైన నిమిషాల వ్యవధిలోనే 400 పాయింట్లకు పైగా పతనం నమోదైంది. దీంతో నిన్న రూ. 4 లక్షల కోట్లకు పైగా హరించుకుపోయిన ఇన్వెస్టర్ల సంపద, నేడు మరో రూ.2 లక్షల కోట్లు తగ్గింది.

ఈ ఉదయం పది గంటల సమయంలో సెన్సెక్స్ 420 పాయింట్ల పతనంతో 37,614 పాయింట్ల వద్దా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 144 పాయింట్ల పతనంతో 11,106 పాయింట్ల వద్దా కొనసాగుతున్నాయి. కీలకమైన మద్దతు స్థాయుల వద్ద కూడా అమ్మకాలు వెల్లువెత్తుతుండగా, మార్కెట్ మరింతగా నష్టపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సెన్సెక్స్ 30లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్ మాత్రమే స్వల్ప లాభాల్లో ఉండగా, మిగతా కంపెనీలన్నీ అర శాతం నుంచి నాలుగు శాతం నష్టాల్లో కొనసాగుతున్నాయి. బ్యాంకెక్స్ మాత్రమే లాభాల్లో ఉంది.

More Telugu News