వ్యవసాయ బిల్లులే అస్త్రం... కాంగ్రెస్ కొత్త ప్లాన్!

22-09-2020 Tue 09:42
Congress New Plan to Take Nationwide Protests on Agriculture Bills
  • ప్రస్తుతానికి ఉత్తరాదికే పరిమితమైన నిరసనలు
  • దక్షిణాదికి కూడా తీసుకెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయం
  • గాంధీ జయంతి రోజున రైతు రక్షక దినం
  • నవంబర్ 14 నాటికి రైతుల నుంచి రాష్ట్రపతికి లేఖలు
  • నిర్ణయించిన కాంగ్రెస్

వ్యవసాయ బిల్లుల అస్త్రాన్ని అందిపుచ్చుకుని, దేశవ్యాప్త ఉద్యమం చేయాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. ఇందుకు పలు విపక్ష పార్టీలతో పాటు, అధికార ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న శిరోమణి అకాలీదళ్ ను కూడా తోడు తీసుకోవాలని, తద్వారా ఉత్తర భారతావనిలో ఇప్పటికే కొనసాగుతున్న రైతు నిరసనలను, దక్షిణాదికి కూడా తీసుకెళ్లి, ఇండియా అంతటా ఉద్యమానికి తెరలేపాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇందుకు తన అనుబంధ బీకేయూ (భారతీయ కిసాన్ యూనియన్)ను వినియోగించుకోవాలని ఆ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఆదివారం నాడు రాజ్యసభలో వివాదాస్పద వ్యవసాయ నియంత్రణ బిల్లులకు ఆమోదం లభించిన సంగతి తెలిసిందే. పలు విపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నా, తమకున్న బలంతో అధికార బీజేపీ, వీటికి ఆమోదం పొందింది. ఈ బిల్లులపై రాష్ట్రపతి సంతకం చేయాల్సి వుండగా, ఆపై ఇవి చట్టరూపం దాల్చి అమల్లోకి రానున్నాయి. ఈలోగానే, దేశవ్యాప్త నిరసనలకు దిగి, ఆ ఘాటును కేంద్రానికి తెలియజేయాలని కాంగ్రెస్ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ బిల్లులు రైతులకు వ్యతిరేకమని, వారిపై మరణశాసనమేనని పార్టీ నేతలు రాహుల్ గాంధీ, ప్రతాప్ సింగ్ బజ్వాలు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.

ఇక గురువారం నుంచి ఈ నిరసనలను దేశవ్యాప్తం చేయాలని కాంగ్రెస్ ఇప్పటికే నిర్ణయించింది. జిల్లా స్థాయిలో, ఆపై రాష్ట్ర స్థాయిలో నిరసనలను తెలియజేయడం, ర్యాలీలు నిర్వహించడం ద్వారా, రైతులంతా ఈ బిల్లులకు వ్యతిరేకమని కేంద్రానికి సంకేతాన్ని పంపాలని కాంగ్రెస్ భావిస్తోంది. సుమారు రెండు కోట్ల మంది రైతుల సంతకాలతో పండిట్ నెహ్రూ జయంతి వేడుకలు జరిగే నవంబర్ 14 నాటికి రాష్ట్రపతికి వినతి పత్రాలు వెళ్లేలా చూడాలన్నది ఆ పార్టీ ఆలోచనగా తెలుస్తోంది.

అంతకన్నా ముందు అక్టోబర్ 2న గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి రోజున రైతు రక్షక దినాన్ని జరపాలని కూడా తమ పార్టీ నిర్ణయించినట్టు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. 2వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించి, శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తామని, రైతులకు వ్యతిరేకంగా ఉన్న ఈ వ్యవసాయ బిల్లులను వెనక్కు తీసుకోవాల్సిందేనని ఆయన అన్నారు.