సీనియర్ ఐపీఎస్ అధికారి స్వాతి లక్రా పేరిట నకిలీ ఫేస్‌బుక్ ఖాతా.. డబ్బులు కావాలంటూ అభ్యర్థన!

22-09-2020 Tue 09:11
  • తమకు వచ్చిన రిక్వెస్ట్ విషయాన్ని స్వాతి దృష్టికి తీసుకెళ్లిన అధికారులు
  • తాను ఎవరినీ డబ్బులు అడగలేదంటూ వివరణ
  • సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు
IPS Officer Swati Lakra responds about fake facebook account

సీనియర్ ఐపీఎస్ అధికారి స్వాతిలక్రా పేరిట నకిలీ ఫేస్‌బుక్ ఖాతాను సృష్టించి దాని ద్వారా డబ్బులు గుంజేందుకు ప్రయత్నిస్తున్న సైబర్ నేరగాళ్ల బండారం బయటపడింది. ఆమె పేరున ఫేస్‌బుక్ ఖాతాను సృష్టించిన నేరగాళ్లు డబ్బులు పంపించాలంటూ ఆమె బంధువులు, స్నేహితులు, పోలీసు అధికారులకు రిక్వెస్టులు పంపారు.

అయితే, తమకు వచ్చిన అభ్యర్థన విషయాన్ని కొందరు అధికారులు నిన్న ఆమె దృష్టికి తీసుకెళ్లడంతో అప్రమత్తమయ్యారు. తనపేరిట వస్తున్న రిక్వెస్టులు నకిలీవని, తాను ఎవరినీ డబ్బులు అడగలేదని స్వాతి తన అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు చేశారు. ఇది చూసిన నేరగాళ్లు ఆ తర్వాత కాసేపటికే నకిలీ ఖాతాను తొలగించారు.

తన పేరిట నకిలీ ఫేస్‌బుక్ ఖాతా క్రియేటైన విషయంపై సైబర్ క్రైం పోలీసులకు స్వాతి లక్రా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటి వరకు 50 మంది పోలీసు అధికారుల పేరిట నకిలీ ఫేస్‌బుక్ ఖాతాలు సృష్టించినట్టు గుర్తించారు. ఒడిశా, రాజస్థాన్ కేంద్రంగా ఈ ముఠా మోసాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు తెలిపారు.