హిందువులంటే అంత చులకనా? కొడాలి నాని క్షమాపణలు చెప్పాల్సిందే: ఏపీ సాధుపరిషత్ డిమాండ్

22-09-2020 Tue 08:54
AP Sadhu parishad fires on minister kodali nani
  • మంత్రి నాని వ్యాఖ్యలను గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్న శ్రీనివాసానంద సరస్వతి
  • జగన్ జోక్యం చేసుకుని క్షమాపణలు చెప్పించాలని డిమాండ్
  • మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందేనన్న శ్రీనివాసానంద

హిందూ దేవుళ్లపై ఏపీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందేనని ఏపీ సాధుపరిషత్ డిమాండ్ చేసింది. ఆంజనేయుని బొమ్మ విరిస్తే వచ్చిన నష్టం ఏమిటి? కనకదుర్గ ఆలయంలో వెండి సింహాల విలువ మహా అయితే రూ. 6 లక్షలు ఉంటుందని మంత్రి వ్యాఖ్యానించడం ఆయన అహంకారాన్ని, అజ్ఞానాన్ని తెలియజేస్తోందని ఏపీ సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి మండిపడ్డారు. మంత్రి వ్యాఖ్యలను గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమైన ఆయన నాని వ్యాఖ్యలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలన్నారు. ముఖ్యమంత్రి జగన్ జోక్యం చేసుకుని మంత్రితో క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, మంత్రి పదవికి నాని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.