Sandalwood: డ్రగ్స్ కేసు.. నటి సంజన, రాగిణి బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

Bail refused to Actresses Sanjana and Ragini Dwivedi
  • రాగిణి అరెస్టులో పోలీసులు నిబంధనలు పాటించలేదు
  • ఆమె ఇంట్లో సిగరెట్లు మాత్రమే దొరికాయన్న లాయర్
  • రాగిణికి 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందన్న సీసీబీ న్యాయవాది
డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం జైలులో ఉన్న శాండల్‌వుడ్ మహిళా నటులు రాగిణి ద్వివేది, సంజన గల్రానీలు పెట్టుకున్న బెయిలు దరఖాస్తుపై విచారణ గురువారానికి వాయిదా పడింది. సిటీ సివిల్ కోర్టు ఆవరణలోని స్పెషల్ కోర్టులో వీరి బెయిలు పిటిషన్లు విచారణకు వచ్చాయి.

 రాగిణిని అరెస్ట్ చేసే సమయంలో పోలీసులు నిబందనలు పాటించలేదని, ఆమె ఇంట్లో సిగరెట్లు మాత్రమే దొరికాయని ఆమె తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఓ నిందితుడు చేసిన ఆరోపణల కారణంగానే ఆమెను అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. రాగిణి తండ్రి మాజీ సైనిక అధికారని, కొవిడ్ సమయంలో పేదలు, వలస కార్మికులకు మద్దతుగా నిలిచారని, కాబట్టి బెయిలు ఇప్పించాలని కోర్టును అభ్యర్థించారు.

సీసీబీ తరపు న్యాయవాదులు తమ వాదన వినిపిస్తూ రాగిణి డ్రగ్స్ విక్రయించినట్టు తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయన్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు తెలిపారు. ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్ పాస్‌వర్డ్ కూడా చెప్పలేదని, వైద్య పరీక్షలకు ఆమె సహకరించలేదని ఆరోపించారు.

ఈ కేసులో ఆమెకు కనీసం 20 ఏళ్ల శిక్ష పడే అవకాశం ఉందని, కాబ్టటి ఇప్పుడు జామీను మంజూరు చేస్తే తదుపరి విచారణ కష్టంగా మారుతుందని, ఆమె తప్పించుకునే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. జామీనుకు ఆక్షేపణలను దాఖలు చేసేందుకు సమయం కావాలని కోరుతూ రిట్ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం రాగిణి, సంజనల బెయిలు పిటిషన్‌ను గురువారానికి వాయిదా వేసింది.
Sandalwood
Ragini Dwivedi
Sanjana Galrani
Bail
CBI

More Telugu News