కార్పొరేట్ వ్యవసాయ బిల్లు అంటే సరిపోయేది: ఉత్తమ్ కుమార్ ఎద్దేవా

21-09-2020 Mon 21:57
Uttam Kumar terms agriculture bill as corporate agriculture bill
  • కేంద్ర నూతన వ్యవసాయ బిల్లుపై ఉత్తమ్ వ్యాఖ్యలు
  • అదానీ, అంబానీలకు మేలు చేసే బిల్లు అంటూ విమర్శలు
  • ఈ నెల 25న బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసనలు

కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టం బిల్లుపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. దీన్ని వ్యవసాయ బిల్లు అనకుండా కార్పొరేట్ వ్యవసాయ బిల్లు అంటే సరిపోయేదని ఎద్దేవా చేశారు. ఈ వ్యవసాయ బిల్లు వలన రైతులకు ఎంతో అన్యాయం జరుగుతుందని తెలిపారు. అదానీ, అంబానీలకు లాభం చేకూర్చేలా బిల్లు ఉందని విమర్శించారు.

ప్రైవేటు కంపెనీలు పంటలను ఎలా కొనుగోలు చేస్తాయో బిల్లులో చెప్పలేదని పేర్కొన్నారు. కనీస మద్దతు ధర మీద కూడా సరైన స్పష్టత ఇవ్వలేదని తెలిపారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 25న ఆందోళనలు చేపడుతున్నామని ఉత్తమ్ కుమార్ ప్రకటించారు. ఈ నిరసన కార్యక్రమాల్లో రైతు సంఘాలు కూడా పాల్గొంటాయని తెలిపారు.