ఇక నిన్ను వదిలేది లేదు.... నిన్ను నీ ఒరిజినల్ స్థితికి తీసుకువస్తాం: రఘురామకృష్ణరాజుపై నందిగం సురేశ్ ఫైర్

21-09-2020 Mon 19:19
YCP MP Nandigam Suresh fires on Raghurama Krishna Raju
  • దళితులపై వ్యాఖ్యలు చేస్తావా అంటూ ఆగ్రహం
  • నీకెందుకు సెక్యూరిటీ అంటూ మండిపాటు
  • ముక్కు నేలకేసి రాయాలంటూ వ్యాఖ్యలు
  • దళితులకు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్

ప్రజలు ఎన్నుకుంటేనే రఘురామకృష్ణరాజు ఎంపీ అయ్యారని, ఆ విషయం మర్చిపోయి అహంకార పూరితంగా మాట్లాడుతున్నారని బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన సెక్యూరిటీతో తోలు వలిపిస్తానని, కాల్చి చంపిస్తానని అంటున్నారని ఆరోపించారు. ఏదో ఒక అడ్డదారిలో వెళ్లి, ఎలాగో తిప్పలు పడి సెక్యూరిటీ తెచ్చుకున్నారని, కానీ ఆ సెక్యూరిటీ సిబ్బందిని ఇచ్చింది దళితులనో, మరెవరినో కాల్పించడానికి కాదని హితవు పలికారు.

"సెక్యూరిటీ సిబ్బందిని ఇచ్చింది నీకు రక్షణ కోసమే తప్ప ఎదుటివాళ్లను చంపడానికి కాదు, చర్మం వలవడానికి కాదు. చర్మం వలిచేవారి పట్ల, దళితుల పట్ల అసూయతో రగిలిపోతూ మాట్లాడారు. దీనిపై మేం ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేశాం. డీజీపీకి, హోం మంత్రికి నోటీసులు పంపి చర్యలు తీసుకుంటామని కమిషన్ తెలిపింది. రఘురామకృష్ణరాజుకు మేమంటేను, మా కులాలు అంటేను చిన్నచూపు ఉంది. ఆయనకు ఆ చిన్నచూపు పోవాలి.

రేపు లోక్ సభ స్పీకర్ ను కలిసి రఘురామకృష్ణరాజుపై ఫిర్యాదు చేస్తాం. ఆయనకు సెక్యూరిటీ తీసేయించాలని విజ్ఞప్తి చేస్తాం. సెక్యూరిటీ ఉంటే ఏదైనా చేస్తాడు. ఆయనకు సెక్యూరిటీ తొలగించేవరకు మా పోరాటం ఆగదు. దళితులను అవమానించేలా మాట్లాడిన రఘురామకృష్ణరాజు వారికి క్షమాపణలు చెప్పిన తర్వాతే పార్లమెంటులో అడుగుపెట్టాలి. ముక్కు నేలకు రాసిన తర్వాతే పార్లమెంటులోకి రావడం తప్ప మరో మార్గం లేదు.

పులివెందులలో 10 వేల మందితో మీటింగ్ పెడతానని అంటున్నాడు. అడవిలో మొరగడానికి, వీధుల్లో మొరగడానికి చాలా తేడా ఉంది. నువ్వు ఎవరినైతే కెలక్కూడదో, ఎవరితోనైతే ఆడుకోకూడదో వారితోనే ఆడుకుంటున్నావు కాబట్టి ఇకపై వాళ్ల ఆట ఎట్లా ఉంటుందో కూడా నీకు తెలుసుద్ది. నువ్వు ఏవిధంగా ఇబ్బంది పెట్టాలనుకుంటున్నావో నీకు అదే తిరిగి జరుగుతుంది.

రఘురామకృష్ణరాజు ఎంత నీచ సంస్కృతి కలిగినవాడంటే... జోహార్ సీఎం అని అన్నాడు. నీ గురించి చెప్పుకోవడానికి భాష కూడా లేదు. ఢిల్లీ వీధుల్లో సిగ్గు విడిచి తిరుగుతున్నావు. నీకు ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయో, బ్యాంకులకు ఎగనామం పెట్టావో, లూటీలు చేశావో, వాటిని కాపాడుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావో మాకు తెలుసు. నువ్వు మళ్లీ నీ ఒరిజినల్ స్థితికి వస్తావని మరోసారి చెబుతున్నా. అది పదవి విషయంలో కావొచ్చు, నీ విగ్గు విషయంలో కావొచ్చు. ఈ రెండు విషయాల్లో నువ్వు ఒరిజినల్ స్థితికి వచ్చేదాకా మేం వదిలిపెట్టం" అంటూ నందిగం సురేశ్ నిప్పులు చెరిగారు.