మంత్రి కేటీఆర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన సుమేధ తల్లిదండ్రులు

21-09-2020 Mon 18:50
Sumedha parents complains police against minister KTR and officials
  • నాలాలో పడి మృతిచెందిన చిన్నారి సుమేధ
  • నేరేడ్ మెట్ పోలీసులను ఆశ్రయించిన సుమేధ తల్లిదండ్రులు
  • 304 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని పోలీసులకు విజ్ఞప్తి

మూడ్రోజుల కిందట సుమేధ అనే బాలిక నాలాలో పడి చనిపోవడం జంటనగరాల్లో తీవ్ర విషాదం కలిగించింది. సుమేధ సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి నేరేడ్ మెట్ దీనదయాళ్ నగర్ లో నాలాలో పడి ప్రాణాలు కోల్పోవడం రాజకీయ దుమారం రేపుతోంది. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని కాంగ్రెస్ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగానే సుమేధ బలైపోయిందని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ ఆరోపించారు.

ఈ నేపథ్యంలో, సుమేధ తల్లిదండ్రులు మంత్రి కేటీఆర్ పై నేరేడ్ మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం, జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం మూలంగానే తమ కూతురు మృతి చెందిందని ఆరోపిస్తూ.. కేటీఆర్ తో పాటు మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్, జోనల్ కమిషనర్, స్థానిక కార్పొరేటర్, సంబంధిత ఏఈ, డీఈలపై కేసు నమోదు చేయాలని వారు పోలీసులను కోరారు. తమ కుమార్తె సుమేధ మృతికి కారణమైన అందరిపై సెక్షన్ 304 కింద కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు.