దమ్మాలపాటిపై ఏసీబీ విచారణను నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంలో ఏపీ సర్కారు పిటిషన్

21-09-2020 Mon 18:33
AP Government goes to Supreme Court on Dammalapati Srinivas case
  • దమ్మాలపాటిపై విచారణ నిలిపేయాలన్న హైకోర్టు
  • హైకోర్టు నిర్ణయంపై సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం
  • ఈ వారంలో విచారణ జరిగే అవకాశం

అమరావతి భూముల వ్యవహారంలో మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ పై ఏసీబీ విచారణ నిలిపివేయాలంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఏపీ సర్కారు సుప్రీంకోర్టు గడప తొక్కింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

అంతకుముందు, అమరావతి భూముల వ్యవహారంలో దమ్మాలపాటి శ్రీనివాస్ పై ఏసీబీ ఎఫ్ఐఆర్  నమోదు చేసింది. తన బంధువుల ద్వారా కృష్ణా జిల్లాలో భూములు కొనుగోలు చేశారని ఏసీబీ ఆరోపిస్తోంది. ఈ మేరకు ఆయనపై కేసు నమోదైంది.

ఈ నేపథ్యంలో దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా, ఈ పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం విచారణపై స్టే ఇచ్చింది. అంతేకాక, దానికి సంబంధించిన వివరాలు మీడియాలో రాకుండా గ్యాగ్ ఆర్డర్ కూడా ఇచ్చింది. ఇప్పుడీ స్టే పైనే ఏపీ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై విచారణ ఈ వారంలోనే జరిగే అవకాశముంది.