చంద్రబాబుకు పెట్టినట్టే మోదీకి కూడా మీటర్లు పెట్టాలి: హరీశ్ రావు

21-09-2020 Mon 17:55
BJP farm bills are anti farmer bills says Harish Rao
  • వ్యవసాయ బోర్లకు మోటార్లు పెట్టాలనుకున్న చంద్రబాబును ఆంధ్రకు తరిమేశాం
  • కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక బిల్లులు తీసుకొస్తోంది
  • రైతుల కోసం ఆలోచించే ఏకైక సీఎం కేసీఆర్

వ్యవసాయ బోరు మోటార్లకు కరెంటు మీటర్లు పెట్లాలనుకున్న చంద్రబాబుకు తెలంగాణ ప్రజలు మీటర్లు పెట్టి ఆంధ్ర ప్రాంతానికి తరిమినట్టే... వ్యవసాయానికి కరెంటు మీటర్లు పెట్టాలనుకున్న ప్రధాని మోదీకి కూడా రాష్ట్ర ప్రజలు మీటర్లు పెట్టాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. రైతు వ్యతిరేక బిల్లులతో రైతుల గుండెల్లో బీజేపీ గుబులు పుట్టిస్తోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఏకంగా కేంద్ర మంత్రి రాజీనామా చేశారంటే ఆ బిల్లులు ఎంత ప్రమాదకరమో ప్రజలు అర్థం చేసుకోవచ్చని అన్నారు.

రాష్ట్రంలో రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉచిత కరెంటు ఇస్తున్నారని... కానీ, మీటర్లు బిగించి రైతుల నుంచి ముక్కుపిండి బిల్లులు వసూలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోందని హరీశ్ అన్నారు. దేశంలో రైతుల గురించి ఆలోచించే ఏకైక మఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పారు. కరోనా సమయంలో ప్రభుత్వానికి ఆదాయం రాకపోయినా... రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రైతుబంధు సాయాన్ని ముందుగానే బ్యాంకుల్లో వేశామని తెలిపారు.