రెండోసారి కుమారుడితో కలిసి ప్లాస్మాదానం చేసిన ఎం.ఎం. కీరవాణి

21-09-2020 Mon 10:33
MM Keeravani myself and my son donated plasma for second time at KIMS
  • ఇటీవల కరోనా నుంచి కోలుకున్న ఎం.ఎం.కీరవాణి 
  • కిమ్స్‌లో ప్లాస్మాదానం
  • తమ రక్తంలో ప్రతిరక్షకాలు యాక్టివ్‌గా ఉన్నాయని వెల్లడి

సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. తాను కోలుకున్నాక ప్లాస్మా ఇస్తానని  ఆయన గతంలోనే ప్రకటించి, కోలుకున్న తర్వాత ఇప్పటికే ఓ సారి ప్లాస్మాదానం చేశారు. తాజాగా, ఆయన తన కుమారుడితో కలిసి రెండో సారి ప్లాస్మాదానం చేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ ట్వీట్ చేశారు.

'మా రక్తంలో ప్రతిరక్షకాలు ఇప్పటికీ యాక్టివ్‌గా ఉన్నాయని వైద్యులు గుర్తించారు. దీంతో నేను, మా కుమారుడు కిమ్స్‌లో రెండోసారి ప్లాస్మా దానం చేశాము. ఒకటి కంటే ఎక్కువ సార్లు ప్లాస్మాదానం చేసినా ఏమీ కాదు.. సంతోషంగా ఉంది' అని కీరవాణి ట్వీట్ చేశారు.

ఈ సందర్భంగా ప్లాస్మాదానం చేస్తోన్న ఫొటోను ఆయన పోస్ట్ చేశారు. కాగా, తన ఇమ్యునోగ్లోబులిన్ స్థాయి 8.62 మాత్రమే ఉందని, ప్లాస్మా దానం చేయాలంటే 15 కంటే అధికంగా ఉండాలని, దీంతో ప్లాస్మాదానం చేయలేకపోతున్నానని ఇటీవల దర్శకుడు రాజమౌళి ప్రకటించిన విషయం తెలిసిందే.