ఫైవ్ స్టార్‌ హోటల్‌లో టూరిస్ట్ గైడ్‌పై సామూహిక అత్యాచారం

21-09-2020 Mon 10:14
Gang Rape on Tourist guide in Delhi
  • ఢిల్లీలోని ఇండియా గేట్ సమీపంలో ఘటన
  • మహిళ ఆర్థిక అవసరాన్ని అవకాశంగా మలచుకున్న నిందితులు
  • ప్రధాన నిందితుడి అరెస్ట్

ఢిల్లీలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో మహిళా టూరిస్ట్ గైడ్‌పై సామూహిక అత్యాచారం జరిగింది. బాధితురాలి ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఐష్ సింఘాల్ కథనం ప్రకారం.. కనాట్ ప్లేస్‌ మార్కెట్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో ఇండియా గేట్ సమీపంలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో బాధిత మహిళ టికెట్ బుకింగ్ ఎగ్జిక్యూటివ్, టూరిస్ట్ గైడ్‌గా పనిచేస్తోంది. హోటల్‌లో నిన్న తనపై సామూహిక అత్యాచారం జరిగినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

హోటల్‌లో గదిని బుక్ చేసుకున్న నిందితులు బాధితురాలికి డబ్బు అవసరం ఉన్నట్టు గుర్తించారు. తక్కువ వడ్డీకి రుణం ఇప్పిస్తామని నమ్మబలికి హోటల్ గదిలోకి తీసుకెళ్లారు. అనంతరం ఆమెపై అత్యాచారానికి తెగబడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఓ మహిళ సహా ఆరుగురు వ్యక్తులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మనోజ్ శర్మను అరెస్ట్ చేసినట్టు సింఘాల్ తెలిపారు.