పశ్చిమ బెంగాల్ లో అరెస్టయిన అనుమానిత ఉగ్రవాది ఇంట్లో బయటపడిన రహస్య గది!

21-09-2020 Mon 08:54
Secret Room in Suspected Terrorist House
  • ఆరుగురిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ
  • అందరి ఇళ్లలో సోదాలు
  • అబూ సూఫియాన్ ఇంట రహస్య గది
  • పలు ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు దొరికాయన్న అధికారులు

పశ్చిమ బెంగాల్ లోని ముషీరాబాద్ జిల్లాలో అల్ ఖైదాకు చెందిన ఉగ్రవాదులన్న అనుమానంతో ఆరుగురిని అరెస్ట్ చేసిన తరువాత, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ అధికారుల సోదాల్లో వీరిలో ఒకరి ఇంట్లో రహస్య గది బయటపడింది.

రాణి నగర్ ఏరియాకు చెందిన అబూ సూఫియాన్ అనే వ్యక్తిని ఆదివారం నాడు అధికారులు అరెస్ట్ చేయగా, ఆపై అందరి ఇళ్లలోనూ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సుఫియాన్ ఇంట్లో 10 అడుగుల పొడవు, 7 అడుగుల వెడల్పు ఉన్న రహస్య గదిని కనిపెట్టామని, ఇక్కడ పలు రకాల ఎలక్ట్రానిక్ గాడ్జెట్ లు, బల్బ్ బోర్డ్ తదితరాలు లభించాయని వెల్లడించారు. కాగా, ఈ చాంబర్ ను సెప్టిక్ ట్యాక్ కోసం తవ్వించామని సోఫియాన్ భార్య మీడియాకు వెల్లడించడం గమనార్హం. దీని గురించి పోలీసులకు వెల్లడించామని కూడా ఆమె చెప్పారు.

ఇక అరెస్ట్ చేసిన వారందరినీ నిన్నంతా కోల్ కతాలో ఇంటరాగేట్ చేశామని ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. కాగా, పశ్చిమ బెంగాల్ లో ఆరుగురిని, కేరళలో ముగ్గురిని ఉగ్రవాద అనుమానితులుగా పేర్కొంటూ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వీరందరినీ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ప్రసేన్ జిత్ బిశ్వాస్ ముందు ప్రవేశపెట్టగా, అందిరికీ రిమాండ్ విధిస్తున్నట్టు పేర్కొన్నారు. వీరందరిపైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న అభియోగాలను ఎన్ఐఏ మోపింది. పశ్చిమ బెంగాల్ లో అబూ సూఫియాన్ తో పాటు నాజ్ముష్ షకీబ్, మణిఉల్ మొండాల్, యీన్ అహ్మద్, అల్ మమున్ కమాల్, అతియుర్ రెహమాన్ లను అరెస్ట్ చేశామని అధికారులు తెలిపారు.