ఆత్మహత్యల్లో తెలంగాణది నాలుగో స్థానం: కేంద్రం

21-09-2020 Mon 08:41
Telangana in fourth place in Suicides
  • సిక్కింలోనే ఎక్కువ ఆత్మహత్యలు
  • ప్రతి లక్షమందిలో 33.1 మంది ఆత్మహత్య
  • బలవన్మరణాలకు పాల్పడుతున్న వారిలో యువకులే అత్యధికం

ఆత్మహత్యల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలో నాలుగో స్థానంలో ఉందని కేంద్రం వెల్లడించింది. ఆత్మహత్యలపై లోక్‌సభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి అశ్వనీకుమార్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

ఆత్మహత్యల్లో సిక్కిం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని, అక్కడ ప్రతి లక్ష మందిలో 33.1 మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మంత్రి వివరించారు. ఆ తర్వాత 26.4 శాతం మందితో చత్తీస్‌గఢ్, 24.3 మందితో కేరళ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయని పేర్కొన్నారు.

తెలంగాణలో ప్రతి లక్షమందిలో 20.6 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలిపారు. ఫలితంగా ఈ జాబితాలో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. తెలంగాణ తర్వాతి స్థానంలో త్రిపుర ఉంది. ఇక్కడ ప్రతి లక్ష మందిలో 18.2 మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

ఆత్మహత్యల్లో జాతీయ సగటు 10.4 మందిగా ఉన్నట్టు మంత్రి తన సమాధానంలో వివరించారు. ఇక, ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో 18 నుంచి 30 ఏళ్ల వారే అత్యధికంగా ఉన్నట్టు జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) ఇటీవల విడుదల చేసిన 2019 నాటి నివేదిక ద్వారా తెలుస్తోంది.