మా నాన్న సీటులో నేను కూర్చుంటాను..: నారా లోకేశ్ తో ఎస్ఐ దుర్గారావు కుమార్తె

21-09-2020 Mon 08:30
Durgarao Daughter Sravani Emotional Talk With Nara Lokesh
  • ఇటీవల మరణించిన ఎస్ఐ అల్లు దుర్గారావు
  • కుటుంబాన్ని పరామర్శించిన టీడీపీ నేతలు
  • పిల్లల చదువు సంగతి తాను చూసుకుంటానన్న లోకేశ్

తన తండ్రి కూర్చున్న చోటనే తాను కూడా కూర్చుంటానని, ఆయన మధ్యలో వదిలేసి వెళ్లిన పనులను తాను చేస్తానని, ఇటీవల మరణించిన ఎస్ఐ అల్లు దుర్గారావు పెద్ద కుమార్తె శ్రావణి వ్యాఖ్యానించింది. దుర్గారావు కుటుంబాన్ని తెలుగుదేశం నేతలు పరామర్శిస్తున్న వేళ, పార్టీ యువనేత నారా లోకేశ్ ఆమెతో ఫోన్ లో మాట్లాడారు. ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

తాను ఇంటర్ చదువుతున్నానని, తన చెల్లెలు పదో తరగతికి వచ్చిందని శ్రావణి చెప్పగా, ఇద్దరి చదువులకూ ఎటువంటి ఆటంకం రాకుండా తాను చూసుకుంటానని లోకేశ్ హామీ ఇచ్చారు. తల్లిని జాగ్రత్తగా చూసుకోవాలని, మనో ధైర్యంతో ఉండాలని, ఎటువంటి సమస్య వచ్చినా తనకు చెప్పాలని సూచించారు.

కాగా, వేధింపుల వల్లే దుర్గారావు మరణించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన అనారోగ్యంతోనే మృతిచెందారని ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహన్ రావు వెల్లడించారు. తుని మండలం చేపూరులోని ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. దుర్గారావు కుటుంబానికి రూ. 50 లక్షల నగదుతో పాటు, ఇంట్లోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తెలిపారు. కుటుంబ సభ్యుల ఆరోపణల మేరకు విచారణ జరిపిస్తామని తెలిపారు.