సరూర్‌నగర్‌లో స్కూటీపై వెళ్తూ వరదలో కొట్టుకుపోయిన వ్యక్తి

21-09-2020 Mon 06:49
Man fell into the flood water in Saroon nagar
  • గత వారం రోజులుగా హైదరాబాద్‌లో వర్షాలు
  • పొంగిపొర్లుతున్న నాలాలు
  • గల్లంతైన వ్యక్తి కోసం గాలిస్తున్న డీఆర్ఎఫ్ సిబ్బంది

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి వరదనీటిలో పడి కొట్టుకుపోయాడు. నగర శివారులోని సరూర్‌నగర్‌లో గతరాత్రి జరిగిందీ ఘటన. బాలాపూర్ ప్రాంతంలోని 35 కాలనీలకు చెందిన వరదనీరు మినీ ట్యాంక్‌బండ్‌లో కలుస్తుంది. గత వారం రోజులుగా నగరంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో వరదనీరు పెద్ద ఎత్తున మినీ ట్యాంక్‌బండ్‌ కు వెళ్తోంది. బాలాపూర్ మండలం అల్మాస్‌గూడకు చెందిన ఎలక్ట్రీషియన్ నవీన్‌కుమార్ (32) గత రాత్రి సరూర్‌నగర్‌ చెరువుకట్ట కింద నుంచి తపోవన్‌ కాలనీ మీదుగా సరూర్‌నగర్‌ గాంధీ విగ్రహం చౌరస్తా వైపు స్కూటీపై బయలుదేరాడు.

భారీ వర్షాల కారణంగా తపోవన్ కాలనీ రోడ్డు నంబరు 6 నుంచి మినీ ట్యాంక్‌బండ్‌లోకి వరదనీరు ఉద్ధృతంగా వెళ్తోంది. ఈ క్రమంలో రోడ్డు దాటేందుకు కాసేపు అక్కడే నిరీక్షించిన నవీన్ కుమార్ కాసేపటి తర్వాత వరద నీటిని దాటే ప్రయత్నం చేశాడు. స్కూటీ అదుపుతప్పడంతో వరద నీటిలో పడి కొట్టుకుపోయాడు.  గమనించిన స్థానికులు అతడిని రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. సమాచారం అందుకున్న డీఆర్ఎఫ్ సిబ్బంది గల్లంతైన వ్యక్తి కోసం గాలిస్తున్నారు.