సరిహద్దుల్లో మరో ఆరు ప్రాంతాలను వశపర్చుకున్న భారత సైన్యం

20-09-2020 Sun 21:36
Indian army has grabbed six more hill places in border
  • ఆత్మరక్షణ ధోరణి వదిలేసిన భారత సైన్యం
  • దూకుడుకు దూకుడుతోనే సమాధానం
  • చైనా బలగాలపై ఆధిపత్యం

గతంలో చైనాతో సరిహద్దుల్లో ఆత్మరక్షణ ధోరణికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన భారత సైన్యం ఇటీవలి పరిణామాల నేపథ్యంలో దూకుడు పెంచింది. తాజాగా ఎల్ఏసీ వద్ద మరో 6 ప్రాంతాలను ఆక్రమించి చైనాను దిగ్భ్రాంతికి గురిచేసింది. గతంలో చైనా ఇదే తరహా వ్యూహాలు అమలు చేసి భారత ప్రభుత్వాన్ని, సైన్యాన్ని ఎంతో అసహనానికి గురిచేసేది. ఓవైపు చర్చలు జరుగుతున్న తరుణంలోనూ చైనా ఇదే తీరు కనబర్చేది.

కానీ, కేంద్రం సైన్యానికి స్వేచ్ఛ ఇస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో భారత సైన్యం ఎల్ఏసీ వద్ద కీలక ప్రాంతాలపై పట్టు సాధించింది. ఆగస్టు 29 నుంచి సెప్టెంబరు రెండో వారం వరకు ఆరు కీలక ప్రాంతాలపై భారత్ ఆధిపత్యం కనబర్చిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మగర్ హిల్, గురుంగ్ హిల్, రీసెహెన్ లా, రెజాంగ్ లా, మోఖ్ పారి, ఫింగర్ 4 పర్వత ప్రాంతాలను భారత్ వశపర్చుకుందని వివరించాయి.

ఈ ప్రాంతాలను తొలుత చైనా బలగాలు ఆక్రమించుకునే ప్రయత్నం చేశాయని, ఈ క్రమంలో మూడు సార్లు చైనా బలగాలు గాల్లోకి కాల్పులు జరిపాయని, అయినప్పటికీ భారత సైన్యం మడమతిప్పలేదని ఓ అధికారి పేర్కొన్నారు.