Terrorists: దావూద్ ఇబ్రహీం సహా 21 మంది ఉగ్రవాదులకు పాక్ లో వీఐపీ రాజభోగాలు

VIP treatment for Dawood Ibrahim and other dreaded terrorists in Pakistan
  • టెర్రరిస్టులపై చర్యలు తీసుకోవాల్సిందేనన్న ఎఫ్ఏటీఎఫ్
  • ఆంక్షలు విధించి ఆశ్రయం కల్పిస్తున్న పాక్
  • అంతర్జాతీయ సమాజాన్ని పాక్ భ్రమింపచేస్తోందన్న నిపుణులు
ఉగ్రవాదులపైనా, ముష్కర సంస్థలపైనా కఠిన చర్యలు తీసుకోకపోతే ఆర్థిక ఆంక్షలు విధిస్తామంటూ పాకిస్థాన్ అంతర్జాతీయ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ఎఫ్ఏటీఎఫ్ పాక్ కు డెడ్ లైన్ కూడా విధించింది. దాంతో తూతూమంత్రంగా కొన్ని చర్యలు ప్రకటించిన పాక్ ఎఫ్ఏటీఎఫ్ ను సంతృప్తి పరిచేందుకు ప్రయత్నించింది. అయితే తాజాగా పాకిస్థాన్ ద్వంద్వ వైఖరి వెల్లడైంది.

ఓ చేత్తో ఆంక్షలు విధించిన పాక్ ప్రభుత్వం మరో చేత్తో ఉపశమనం కలిగిస్తోందన్న విషయం బట్టబయలైంది. దావూద్ ఇబ్రహీం వంటి మాఫియా డాన్ సహా 21 మంది ఉగ్రవాదులకు, ముష్కర నేతలకు పాకిస్థాన్ ఇప్పటికీ ఆశ్రయం కల్పిస్తోందని, వారికి వీఐపీ తరహా రాజభోగాలు అందుతున్నాయని తెలిసింది. గత నెలలోనే టెర్రరిస్టులపై ఆంక్షలు విధించిన పాక్ సర్కారు... ఇప్పుడదే టెర్రరిస్టులకు వీఐపీ భద్రత కల్పిస్తోందన్న నిజం వెల్లడైంది. ఈ జాబితాలో దావూద్ ఇబ్రహీంతో పాటు బబ్బర్ ఖల్సా చీఫ్ వధ్వా సింగ్, ఇండియన్ ముజాహిదీన్ చీఫ్ రియాజ్ భత్కల్ తదితరులున్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ నిపుణులు పాక్ వైఖరి భ్రమింప చేసేదిగా ఉందని అంటున్నారు. ఓవైపు టెర్రరిస్టులపై చర్యలు తీసుకుంటున్నట్టు అంతర్జాతీయ సమాజాన్ని నమ్మిస్తోందని, మరోవైపు భారత్ వెదుకుతున్న అనేకమంది టెర్రరిస్టులను ఆశ్రయం కల్పిస్తోందని తెలిపారు. 
Terrorists
VIP Treatment
Pakistan
FATF
India

More Telugu News