కరోనా నుంచి కోలుకుని ఆలయంలో ఆనంద తాండవం చేసిన బీజేపీ ఎమ్మెల్యే

20-09-2020 Sun 20:08
Gujarat BJP MLA Madhu Srivastav dances in a temple after he got recovered from corona
  • గుడిలో గుజరాత్ ఎమ్మెల్యే గానా భజానా
  • ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న మధు శ్రీవాస్తవ్
  • నేను బాహుబలిని అంటూ ఆసుపత్రి నుంచే పేర్కొన్న ఎమ్మెల్యే

రాజకీయాల్లోనూ కొందరు విలక్షణ వ్యక్తులు ఉంటారు. ఈ గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే కూడా అలాంటివాడే. ఆయన పేరు మధు శ్రీవాస్తవ్. వడోదరలోని వఘోడియా నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అయిన మధు శ్రీవాస్తవ్ ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నారు. కరోనాను జయించానన్న ఆనందంతో ఆయన గజ్రావాడి హనుమాన్ ఆలయంలో తాండవం చేశారు. సంతోషంతో డ్యాన్సులు చేశారు.

ఎక్సర్ సైజులు, డ్యాన్స్ మూమెంట్స్ కలిపి ఓ సరికొత్త నృత్య రీతిలో చిందులేసి వినోదం పండించారు. పైగా భజన గీతాలు కూడా ఆలపించి అందరినీ అలరించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మధు శ్రీవాస్తవ్ ఎమ్మెల్యేనే కాదు సినీ నటుడు కూడా. ఆయన స్వయంగా నిర్మించే చిత్రాల్లో నటిస్తూ తన ఉత్సాహాన్ని చాటుకుంటుంటారు.

కాగా, అంతకుముందు తనకు కరోనా సోకిన సమయంలో మధు శ్రీవాస్తవ్ ఆసుపత్రి  బెడ్ పై నుంచి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా అనిపిస్తాయి. "నేను బాహుబలిని. నేను కరోనా వైరస్ ను ఓడిస్తాను. ఇదొక వైరస్సా. ఇదేమంత బలమైనది కాదు. ఇప్పటికే ఇది సగం చచ్చింది, మిగతా సగాన్ని నేను చంపుతాను. ఎప్పటికీ నేను మీ సేవకుడ్నే" అంటూ అభిమానులను, నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి సందేశం అందించారు.