ఐపీఎల్ 2020: ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్... టాస్ గెలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్

20-09-2020 Sun 19:23
Kings eleven punjab won the toss against Delhi Capitals
  • నేడు ఢిల్లీ, పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్
  • వేదికగా నిలుస్తున్న దుబాయ్ స్టేడియం
  • రెండు జట్లలోనూ యువ ఆటగాళ్లు

ఐపీఎల్ తాజా సీజన్ లో నేడు రెండో మ్యాచ్ కి సర్వం సిద్ధమైంది. ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్ కు దుబాయ్ వేదికగా నిలుస్తోంది. ఈ పోరులో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇరు జట్లలోనూ ఉత్సాహం ఉరకలు వేసే ఆటగాళ్లు ఉండడంతో మ్యాచ్ పోటాపోటీగా సాగనుందని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ లో ప్రధానంగా అందరి దృష్టి కెప్టెన్ కేఎల్ రాహుల్ పై ఉండనుంది. రాహుల్ ఫామ్ కొనసాగిస్తే మాత్రం పరుగులు వెల్లువెత్తడం ఖాయం. గ్లెన్ మ్యాక్స్ వెల్, నికోలాస్ పూరన్ వంటి హార్డ్ హిట్టర్లు ఉండడం ఆ జట్టుకు అదనపు బలం. బౌలింగ్ లో మహ్మద్ షమీ, షెల్డన్ కాట్రెల్ పైనే భారం ఉంది.

ఇక ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు గత సీజన్ ఊపును ఈసారి కూడా కొనసాగించాలని పట్టుదలతో ఉంది. యువ సారథి శ్రేయాస్ అయ్యర్ స్ఫూర్తిదాయక నాయకత్వంలో 2019 సీజన్ లో కొన్ని అద్భుత విజయాలు సాధించి గత సీజన్ల పరాజయాలను మరుగున పడేసింది.

ఇక ఆ జట్టులో ఆటగాళ్ల విషయానికొస్తే... శిఖర్ ధావన్, పృథ్వీ షా, హెట్మెయర్, అయ్యర్, రిషభ్ పంత్ లతో బ్యాటింగ్ బలంగా ఉంది. మార్కస్ స్టొయినిస్ వంటి ఆల్ రౌండర్ అదనపు బలం.బౌలింగ్ లో ప్రధానంగా కగిసో రబాడా, ఎన్రిచ్ నోర్జే, అశ్విన్ రాణిస్తే ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్ కు కష్టాలు తప్పవు.