పాయల్ ఘోష్ కు కంగనా మద్దతు.. అనురాగ్ కశ్యప్ ను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్

20-09-2020 Sun 19:03
Kangana Ranaut comes in support for Payal Ghosh
  • దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై పాయల్ ఘోష్ ఆరోపణలు
  • పాయల్ ను కూడా నిశ్శబ్దంలోకి నెట్టేస్తారన్న కంగనా
  • తనకు కూడా దారుణ అనుభవాలు ఎదురయ్యానని వెల్లడి

బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆరోపణలు చేసిన నటి పాయల్ ఘోష్ కు స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ మద్దతు పలికారు. పాయల్ ఘోష్ చేసిన ఆరోపణల ట్వీట్ ను రీట్వీట్ చేసిన కంగనా మీటూ హ్యాష్ ట్యాగ్ పెట్టడంతో పాటు, అనురాగ్ కశ్యప్ ను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు.

అంతేకాదు, పాయల్ ఘోష్ చేసిన ఆరోపణల పట్ల స్పందిస్తూ, అత్యాచారాలకు పాల్పడిన వాళ్లు, వేధింపులకు పాల్పడేవాళ్లు ఇప్పటికీ బాలీవుడ్ లో స్వేచ్ఛగా తిరుగుతున్నారని, మీటూ ఉద్యమాన్ని చంపేశారని ఆరోపించారు. ఇతర బాధితుల్లానే పాయల్ ఘోష్ ను కూడా తమ వేధింపులతో నిశ్శబ్దంలోకి నెట్టేస్తారని, ఆమె పట్ల సానుభూతి తెలుపుకుంటున్నానని కంగనా మరో ట్వీట్ లో పేర్కొన్నారు.

పాయల్ ఘోష్ కు జరిగినట్టే తనకు కూడా కొందరు పెద్ద హీరోల చేతిలో దారుణమైన అనుభవాలు ఎదురయ్యాయని కంగనా తెలిపారు. కానీ మనకు మెరుగైన సమాజం అవసరం ఎంతో ఉందని అభిప్రాయపడ్డారు.