నిన్నటి విజయంతో ధోనీ ఖాతాలో మరో ఘనత

20-09-2020 Sun 18:18
Dhoni records rare feet as he registered hundred victories after defeated Mumbai Indians
  • సూపర్ కింగ్స్ కు కెప్టెన్ గా 100 విజయాలు అందించిన ధోనీ
  • నిన్న ముంబయి ఇండియన్స్ తో మ్యాచ్ ద్వారా 100వ విక్టరీ
  • ఐపీఎల్ లో ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్ ధోనీనే!

టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీకి రికార్డులు కొత్త కాదు. భారత కెప్టెన్ గా అనేక ఘనతలు అందుకున్న ధోనీ ఐపీఎల్ లోనూ అరుదైన ఘనత సాధించాడు. నిన్న ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ పై గెలవడం ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ కు 100 విజయాలు అందించాడు. ఐపీఎల్ చరిత్రలో మరే కెప్టెన్ ఇన్ని విజయాలు సాధించలేదు. ఐపీఎల్ లో 100 విజయాలు నమోదు చేసిన మొట్టమొదటి కెప్టెన్ గా ధోనీ రికార్డు పుటల్లోకెక్కాడు.

అంతేకాదు, ముంబయి ఇండియన్స్ పై చెన్నై జట్టు వరుసగా ఐదు పరాజయాలు చవిచూసిన నేపథ్యంలో నిన్నటి గెలుపుతో ఈ పరంపరకు అడ్డుకట్ట వేశాడు. కాగా, ధోనీ 2019 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ తో సెమీఫైనల్ తర్వాత మళ్లీ క్రికెట్ బరిలో దిగలేదు. 437 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత ఐపీఎల్ తాజా సీజన్ లో మళ్లీ ఆట మొదలుపెట్టాడు. ఇటీవల ఆగస్టు 15న ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంటు ప్రకటించిన సంగతి తెలిసిందే.