వ్యవసాయ బిల్లుపై చర్చ సందర్భంగా రాజ్యసభలో తీవ్ర దుమారం

20-09-2020 Sun 16:58
Opposition parties demands Centre must revoke new agriculture bill
  • రాజ్యసభలో నూతన వ్యవసాయ బిల్లుపై చర్చ
  • ముసాయిదా ప్రతులు చించిన తృణమూల్ సభ్యుడు
  • నినాదాలతో హోరెత్తించిన కాంగ్రెస్, మిత్ర పక్షాల సభ్యులు

కేంద్రం తీసుకువస్తున్న నూతన వ్యవసాయ చట్టం తాలూకు బిల్లుకు ఉభయసభల్లో ఆమోదం లభించింది. ఇవాళ రాజ్యసభలో ఈ బిల్లుపై చర్చ జరిగిన సమయంలో విపక్ష సభ్యులు ఆందోళనలకు దిగారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ డిప్యూటీ చైర్మన్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. రైతు వ్యతిరేక బిల్లు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ బిల్లు ముసాయిదా ప్రతులను చించి పోడియం దిశగా విసిరేశారు.

మరోవైపు ఆప్, శిరోమణి అకాలీదళ్ సభ్యులతో పాటు తృణమూల్ సభ్యులు మైకులు విరిచేందుకు ప్రయత్నించారు. రైతు వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలంటూ కాంగ్రెస్, ఇతర పక్షాలు బిగ్గరగా నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ సందర్భంగా రాజ్యసభ ఓసారి వాయిదా పడినా, తిరిగి ప్రారంభమైన సమయంలో మూజువాణి ఓటుతో వ్యవసాయ బిల్లుకు ఆమోదం లభించింది. దాంతో సభ సోమవారానికి వాయిదాపడింది.