టప్పర్ వేర్ తో కోట్లు సంపాదించవచ్చంటూ రూ.4 కోట్లకు ముంచేసిన మాయలేడి!

20-09-2020 Sun 16:15
Woman cheats other woman in the name of Tupperware business
  • నల్గొండ జిల్లాలో ఘటన
  • నెలకు రూ.30 వేల కమీషన్ ఇస్తానంటూ ప్రలోభం
  • నిజమేనని నమ్మి పెట్టుబడులు పెట్టిన మహిళలు

నల్గొండ జిల్లాలో ఓ మాయలేడి టప్పర్ వేర్ వ్యాపారం పేరిట ఏకంగా రూ.4 కోట్లకు కుచ్చుటోపీ పెట్టింది. నల్గొండ శివాజీనగర్ కు చెందిన ఆకుల స్వాతి టప్పర్ వేర్ వ్యాపారం పేరుతో ఓ షాపు తెరిచింది. టప్పర్ వేర్ వ్యాపారంలో పెట్టుబడులు పెడితే లాభాల పంట పండుతుందని, నెలకు కమీషన్ రూపంలోనే రూ.30 వేల వరకు వస్తాయని పలువురిని ప్రలోభాలకు గురిచేసింది. స్వాతి మాటలు నమ్మిన కొందరు మహిళలు భారీగా పెట్టుబడులు పెట్టారు.

మానస అనే మహిళ రూ.1.30 కోట్లు, భారతమ్మ అనే మహిళ రూ.19 లక్షలు పెట్టుబడి పెట్టారు. ఈ విధంగా స్వాతి మొత్తం 15 మంది మహిళల నుంచి రూ.4 కోట్ల వరకు వసూలు చేసింది. మొదట్లో రెండు నెలల పాటు క్రమం తప్పకుండా కమీషన్ ఇచ్చిన స్వాతి ఆపై ప్లేటు ఫిరాయించింది. దాంతో కొందరు మహిళలు స్వాతిని ప్రశ్నించడంతో, మీరు పెట్టుబడి పెట్టినట్టు ఆధారాలేమున్నాయి? మనం ఏమైనా అగ్రిమెంట్ రాసుకున్నామా? అంటూ తిరిగి ప్రశ్నించింది.

దాంతో, ఆ మహిళలకు తాము మోసపోయినట్టు అర్థమైంది. వారందరూ కలిసి స్థానిక శాసనసభ్యుడు కంచర్ల భూపాల్ రెడ్డికి ఫిర్యాదు చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. ఆయన ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో స్వాతిని అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు ఆరంభించారు.