డిక్లరేషన్ పై సంతకం పెడితే హిందువు కాదని తెలిసిపోతుందని భయమా?: తులసిరెడ్డి

20-09-2020 Sun 15:38
Congress leader Tulasi Reddy questions CM Jagan on Tirumala Declaration
  • వివాదాస్పదంగా మారిన తిరుమల డిక్లరేషన్ అంశం
  • ముఖ్యమంత్రే నిబంధనలు అతిక్రమించడం భావ్యమా అన్న తులసిరెడ్డి
  • నమ్మకం లేకుండా తిరుమల వెళ్లడం ఎందుకని వ్యాఖ్యలు

అన్యమతస్తులు ఎవరైనా తిరుమల వస్తే శ్రీవారి దర్శనం చేసుకోవడానికి డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఎప్పటినుంచో అమల్లో ఉంది. అయితే ఇటీవల టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలతో డిక్లరేషన్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై విపక్షాలు తీవ్రస్థాయిలో స్పందిస్తున్నాయి. తాజాగా, ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ఘాటుగా స్పందించారు.

తిరుమలలో డిక్లరేషన్ పై సంతకం చేయడానికి సీఎం జగన్ కు వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. ఒకవేళ డిక్లరేషన్ పై సంతకం పెడితే తాను హిందువు కాదని తెలిసిపోతుందని భయమా? లేకపోతే, వెంకటేశ్వరస్వామిపై నమ్మకం, భక్తి లేకనా? అని వ్యాఖ్యానించారు. నమ్మకం లేకుండా తిరుమలకు వెళ్లడం ఎందుకని అన్నారు. ముఖ్యమంత్రే నిబంధనలు ఉల్లంఘించాలని చూడడం సరికాదని హితవు పలికారు.

కాగా, డిక్లరేషన్ పై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వివరణ ఇచ్చినా విపక్షాలు మాత్రం వాగ్బాణాలు సంధిస్తూనే ఉన్నాయి.