టిక్ టాక్ పై నిషేధం వారం పాటు వాయిదా... పేరు మార్చుకోనున్న టిక్ టాక్

20-09-2020 Sun 15:05
Tik Tok join hands with Oracle and Walmart in US
  • ఒరాకిల్, వాల్ మార్ట్ తో టిక్ టాక్ ఒప్పందం
  • టిక్ టాక్ గ్లోబల్ ఏర్పాటు!
  • టిక్ టాక్ పై నిషేధం పూర్తిగా తొలగిపోయే అవకాశం

అమెరికాలో టిక్ టాక్ కార్యకలాపాలపై ట్రంప్ సర్కారు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధం ఇవాళ్టి నుంచి అమలు కావాల్సి ఉండగా, తాజా పరిణామాల నేపథ్యంలో నిషేధాన్ని వారం పాటు వాయిదా వేశారు. అమెరికాలో తన కార్యకలాపాలు కొనసాగించేందుకు టిక్ టాక్ యాజమాన్య సంస్థ బైట్ డ్యాన్స్... ఒరాకిల్, వాల్ మార్ట్ వంటి అమెరికా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవడమే అందుకు కారణమని తెలుస్తోంది.

ఈ ఒప్పందానికి వైట్ హౌస్ మద్దతు ఉంటుందని అధ్యక్షుడు ట్రంప్ కూడా సానుకూల స్పందన వ్యక్తం చేశారు. ఈ మూడు సంస్థల కలయికతో అమెరికాలో మరో పాతికవేల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని, పౌరుల వ్యక్తిగత సమాచార భద్రతకు ఎలాంటి ఢోకా ఉండబోదని ట్రంప్ అన్నారు.

కాగా, బైట్ డ్యాన్స్, ఒరాకిల్, వాల్ మార్ట్ కలిసి ఏర్పాటు చేయబోయే సంస్థను టిక్ టాక్ గ్లోబల్ గా పిలవనున్నారు. దీని కేంద్ర కార్యాలయం టెక్సాస్ లో ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. టిక్ టాక్ గ్లోబల్ కార్యరూపం దాల్చితే అమెరికాలో టిక్ టాక్ పై నిషేధం పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంది.