కేంద్ర నూతన వ్యవసాయ చట్టం బిల్లుకు రాజ్యసభ ఆమోదం... వైసీపీ, టీడీపీ సానుకూలం

20-09-2020 Sun 14:52
New Agriculture Bill passed in Rajyasabha
  • నూతన వ్యవసాయ చట్టానికి కేంద్రం రూపకల్పన
  • బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం
  • మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోదం
  • ఈ చట్టంతో రైతులకు ప్రయోజనం ఏంటన్న దేవెగౌడ

కేంద్రం సరికొత్త సంస్కరణలు తీసుకువచ్చే క్రమంలో నూతన వ్యవసాయ చట్టానికి రూపకల్పన చేసింది. ఈ వ్యవసాయ చట్టం బిల్లుకు తాజాగా రాజ్యసభలో ఆమోదం లభించింది. ఈ బిల్లుకే కాకుండా దీని అనుబంధ వ్యవసాయ బిల్లులకు కూడా ఆమోదం లభించింది. విపక్షాల ఆందోళనల మధ్య మూజువాణి ఓటుతో బిల్లులు ఆమోదం పొందాయి.

ఈ బిల్లులకు బీజేపీ, బీజేడీ, వైసీపీ, టీడీపీ, అన్నాడీఎంకే పార్టీలు మద్దతు పలికాయి. అటు, కాంగ్రెస్, టీఆర్ఎస్, తృణమూల్, డీఎంకే, శివసేన, ఆర్జేడీ, అకాలీదళ్, ఎస్పీ, బీఎస్పీ, ఆమ్ ఆద్మీ పార్టీలు వ్యతిరేకించాయి. బిల్లుల ఆమోదం అనంతరం రాజ్యసభ సోమవారానికి వాయిదా పడింది.

కాగా, కేంద్ర నూతన వ్యవసాయ చట్టంపై మాజీ ప్రధాని దేవేగౌడ కేంద్రాన్ని ప్రశ్నించారు. కొత్త చట్టంతో రైతులకు ప్రయోజనం ఏంటని అన్నారు. వ్యవసాయ బిల్లులపై సందేహాలకు ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో ఆగమేఘాలపై బిల్లు ప్రవేశపెట్టారని విమర్శించారు.