రైతులకు అండగాలేని ఇలాంటి చట్టాలెందుకు?: కేంద్ర వ్యవసాయ చట్టం బిల్లుపై కేకే వ్యాఖ్యలు

20-09-2020 Sun 14:16
TRS Parliamentary leader Keshavarao hits out new agriculture bill
  • కేంద్ర నూతన వ్యవసాయ బిల్లును వ్యతిరేకించిన టీఆర్ఎస్ ఎంపీలు
  • రైతులకు తీరని నష్టం జరుగుతుందన్న కె.కేశవరావు
  • కార్పొరేట్లకు మేలు చేసేలా ఉందని విమర్శలు

కేంద్రం నూతనంగా వ్యవసాయ చట్టం తీసుకురావాలనుకుంటున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అయితే ఈ కేంద్ర వ్యవసాయ చట్టం బిల్లును టీఆర్ఎస్ సభ్యులు వ్యతిరేకించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వారు ఈ వ్యవసాయ బిల్లుకు ఆమోదం తెలుపలేదు. దీనిపై  టీఆర్ఎస్ పక్ష పార్లమెంటరీ నేత కె.కేశవరావు స్పందించారు.

ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, రైతులకు అండగా లేని ఇలాంటి చట్టాలు ఎందుకని ప్రశ్నించారు. కొత్త వ్యవసాయ చట్టంతో రైతులకు తీరని నష్టం కలిగే అవకాశం ఉందని అన్నారు. వ్యవసాయ రంగంలో కార్పొరేట్లకు మేలు చేసేలా ఈ కొత్త చట్టం ఉందని, మార్కెటింగ్ ఏజెంట్లకు సైతం ఈ చట్టంతో నష్టాలు తప్పవని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల హక్కులను హరించేలా కేంద్రం వ్యవహరిస్తోందని కేకే విమర్శించారు. వ్యవసాయం, దాని అనుబంధ అంశాలు ఎల్లప్పుడూ రాష్ట్ర పరిధిలోనే ఉండాలని  స్పష్టం చేశారు.