వెనుకనుంచి కామెంట్లు చేస్తుండడంతో భరించలేకే వాళ్లని వెళ్లిపొమ్మని చెప్పా: తలసాని

20-09-2020 Sun 13:38
Talasani alleges Congress leaders makes comments
  • టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య లక్ష ఇళ్ల వివాదం
  • భట్టి విక్రమార్క ఇంటికెళ్లి ఆశ్చర్యపరిచిన మంత్రి తలసాని
  • కాంగ్రెస్ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని వెల్లడి

టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య డబుల్ బెడ్రూం ఇళ్ల వివాదం నడుస్తోంది. అసెంబ్లీలో మొదలైన రగడ, బయట కూడా కొనసాగుతోంది. ఇప్పటికే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అనూహ్యరీతిలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇంటికి వెళ్లి ఆయనను స్వయంగా వెంటతిప్పుకుని డబుల్ బెడ్రూం ఇళ్లు చూపించారు. తాను ఇంత చేస్తున్నా కాంగ్రెస్ నేతల నుంచి విమర్శలు ఆగడంలేదని తాజాగా తలసాని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ నేతల సవాల్ ను స్వీకరించి, వారిని డబుల్ బెడ్రూం ఇళ్ల వద్దకు తీసుకెళితే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇళ్ల పరిశీలన సమయంలో తాను ముందు నడస్తుంటే వెనుక నుంచి కాంగ్రెస్ నేతలు కామెంట్లు చేస్తున్నారని, ఆ కామెంట్లు తట్టుకోలేక వారిని వెళ్లిపొమ్మని చెప్పానని వివరణ ఇచ్చారు. ఇక వాళ్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని భావిస్తున్నానని, డబుల్ బెడ్రూం ఇళ్ల లిస్టు పంపించి చూసుకోమని చెప్పానని తెలిపారు.

ప్రభుత్వం నిర్వహించిన గృహ సముదాయాల లొకేషన్లు చాలానే ఉన్నాయని, అవన్నీ పరిశీలిస్తే లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు ఉన్నాయో లేదో వారికే తెలుస్తుందని మంత్రి తలసాని స్పష్టం చేశారు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఎన్ని కట్టామో ఆ వివరాలు మీడియాకే ఇస్తామని చెప్పారు. తలసాని ఇవాళ కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో పర్యటన సాగిస్తున్నారు. ఈ సందర్భంగానే ఆయన పై వ్యాఖ్యలు చేశారు.