Maoists: బ్రేకింగ్... భారీ ఎన్ కౌంటర్ నుంచి తప్పించుకున్న మావో నేత భాస్కర్... వేట మొదలు!

  • ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన
  • గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న కూంబింగ్
  • ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోల మృతి
Coombing for Mao Leader Bhasker

కొమ్రుంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో మావోయిస్టుల కీలక నేత భాస్కర్ తప్పించుకోగా, అతని కోసం ప్రత్యేక కూంబింగ్ దళాలు వేటను ప్రారంభించాయి. గత కొన్ని రోజులుగా కాగజ్ నగర్ మండలం, ఈజ్ గామ్ పోలీసు స్టేషన్ పరిధిలోని కడంబ అడవుల్లో కూంబింగ్ జరుగుతోంది. తాజాగా, వారికి మావోయిస్టులు కనిపించగా, వారిని లొంగిపోవాలని హెచ్చరించారు. మావోయిస్టులు వినకుండా, కాల్పులకు దిగడంతో, పోలీసులు ఎదురు కాల్పులు ప్రారంభించారు.

ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా మావోల కీలక నేత భాస్కర్ తప్పించుకున్నట్టు తెలుస్తోంది. ఆ వెంటనే విషయం తెలుసుకున్న అదనపు బలగాలు, ఆ ప్రాంతానికి చేరుకుని, అడవిలోని అణువణువునూ జల్లెడ పడుతున్నాయి. కాగా, మృతి చెందిన మావోయిస్టులు కోయా జంగు అలియాస్ వర్గీస్, కంచి లింగవ్వగా గుర్తించామని అధికారులు వెల్లడించారు. ఎన్ కౌంటర్ జరిగిన స్థలంలో పోలీసులు రెండు ఏకే 47 తుపాకులతో పాటు, మావోల డంప్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇదిలావుండగా, గడచిన రెండు మూడు నెలలుగా ఈ ప్రాంతంలో మావోల నేత భాస్కర్ కోసం ప్రత్యేక దళాలు కూంబింగ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయి. ఈ ఘటన తరువాత, ఎలాగైనా అతన్ని పట్టుకోవాలన్న లక్ష్యంతో మరిన్ని బలగాలతో సెర్చ్ ఆపరేషన్ ను ప్రారంభించినట్టు తెలుస్తోంది.

More Telugu News