దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై హీరోయిన్ పాయల్ ఘోష్ సంచలన ఆరోపణ!

20-09-2020 Sun 12:22
Actress Payal Ghosh Sensational Comments on Anurag Kashyap
  • ఇంటికి పిలిచి దుస్తులు విప్పబోయాడు
  • అతన్నుంచి ప్రాణహాని ఉంది
  • ప్రధాని కార్యాలయానికి పాయల్ ట్వీట్

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ నుంచి తనకు ప్రాణహాని ఉందని, అతను తనతో ఎంతో అసభ్యంగా ప్రవర్తించాడని, తన దుస్తులను విప్పాలని చూశాడని నటి పాయల్ ఘోష్ సంచలన ఆరోపణలు చేసింది. తాజాగా ఓ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె, తనపై కశ్యప్ లైంగిక వేధింపులకు కూడా పాల్పడ్డాడని, ఎంతో ఇబ్బందికరంగా ప్రవర్తించాడని పేర్కొంది.

జరిగిన పాత ఘటనలను వివరిస్తూ, తనతో మాట్లాడాలని ఉందని అనురాగ్ ఓ మారు ఫోన్ చేసి పిలిచాడని పాయల్ ఘోష్ వెల్లడించింది. ఆ మరుసటి రోజు ఆయనింటికి వెళ్లానని, అప్పటికే పూటుగా తాగివున్న అనురాగ్,డ్రగ్స్ కూడా తీసుకుని ఉన్నాడని అనిపించిందని, గదిలోకి తీసుకెళ్లి, తాను ధరించిన దుస్తులను తొలగించబోయాడని సంచలన ఆరోపణలు చేసింది.

తాను తీవ్రంగా ప్రతిఘటించగా, బాలీవుడ్ లో ఇవన్నీ సాధారణమేనని, రిచా చద్దా, హ్యూమా ఖురేషీ తదితరులు తాను పిలవగానే వస్తారని చెప్పాడని పాయల్ వివరించింది. ఆపై తనకు పరిశ్రమలో మంచి పేరుందని, అమితాబ్ అంటే తనకు ఇష్టమని చెబుతూ, తనను లొంగతీసుకునేందుకు చూశారని ఆరోపించింది.

ఈ ఘటన రణబీర్ కపూర్ తో 'బాంబే వెల్వెట్' సినిమాను అనురాగ్ షూట్ చేస్తున్న సమయంలో జరిగిందని, రణబీర్ తో నటించాలంటే, తనతో సన్నిహితంగా ఉండాల్సిందేనని, అందుకు ఏ అమ్మాయి అయినా అంగీకరిస్తుందని కూడా చెప్పాడని ఆరోపించింది. తనకిప్పుడు అతన్నుంచి ప్రాణహాని ఉందని, తనను కాపాడాలని కోరుతూ, ప్రధాని కార్యాలయాన్ని ట్యాగ్ చేస్తూ పాయల్ ఓ ట్వీట్ పెట్టడం గమనార్హం.

తాను చేసిన ఆరోపణల తరువాత, తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయని, దయచేసి నరేంద్ర మోదీ కల్పించుకుని, అనురాగ్ పై చర్యలు తీసుకుని తన ప్రాణాలను కాపాడాలని కోరింది. పాయల్ ఘోష్ చేసిన ఆరోపణలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆమెకు మద్దతుగా నిలిచిన కంగన, అనురాగ్ ను వెంటనే అరెస్ట్ చేయాలని ట్వీట్ చేసింది.