రామగుండం ప్రాంతానికి వచ్చిన పెద్ద పులి... ఎక్కడికి వెళ్లిందో తెలియక తలలు పట్టుకుంటున్న అధికారులు!

20-09-2020 Sun 11:59
Tiger Evidence in Karimnagar District
  • ఆవాసం కోసం వెతుకుతూ తిరుగుతున్న పులి
  • పాదముద్రలను మాత్రమే కనిపెట్టిన అధికారులు
  • ఎన్టీపీసీ రిజర్వాయర్ అడవుల్లోకి వెళ్లిందని వెల్లడి

రామగుండం సమీపంలోకి ఓ పెద్ద పులి వచ్చింది. సమీప ప్రాంతాల్లో నుంచి ఇది బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. గడచిన పదిహేను రోజులుగా దీని పాదముద్రలు మాత్రమే కనిపిస్తున్నాయి. అంతకుమించి, పులి ఎటువైపు వెళ్లిందన్న విషయం మాత్రం అధికారులకు అంతు చిక్కడం లేదు. దీంతో ఆటవీ విభాగం అధికారులు మొత్తం ఇది ఎటు వెళుతోంది? ఎలా తిరుగుతుందన్న విషయాన్ని తేల్చలేక తలపట్టుకుంటుండగా, ఇది ఎప్పుడు, ఎవరిపై దాడి చేస్తుందన్న విషయం తెలియక ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

కాగా, ఈ నెల 7వ తేదీన తొలిసారిగా పులి పాదముద్రలను అధికారులు ఓడేడు అనే గ్రామం శివార్లలో గుర్తించారు. ఇది భూపాలపల్లి జిల్లా నుంచి, పెద్దపల్లి జిల్లాకు వచ్చిందని, అప్పటి నుంచి సరైన ఆవాసం కోసం వెతుకుతూ నిరంతరం సంచరిస్తోందని తెలుస్తోంది. దీని ప్రయాణం ముత్తారం, కమాన్ పూర్, పాలకుర్తి తదితర మండలాల మీదుగా ఎన్టీపీసీ రిజర్వాయర్ వరకూ సాగిందని కూడా అధికారులు గుర్తించారు. ఇదే సమయంలో బగుళ్ల గుట్ట వద్ద ఆవుల మందపై దాడి చేసి, తన ఆకలిని కూడా అది తీర్చుకుంది.

అయితే, ఇంతవరకూ పులి ఆనవాళ్లు తప్ప, పులి పెద్దగా కనిపించిన దాఖలాలు లేవు. ఇది బగుళ్ల గుట్ట వద్ద తప్ప, మరెక్కడా జంతువులపైనా, మనుషుల పైనా దాడి చేసినట్టు వార్తలు రాలేదు. ఇక, పులి పాదముద్రలను ఎప్పటికప్పుడు అధికారులు గుర్తిస్తూ, దాని దారిని గుర్తించి, అది రిజర్వాయర్ అటవీ ప్రాంతానికి చేరుకుందని అటవీ శాఖ సెక్షన్ అధికారులు అంటున్నారు. అయితే, ఇది రిజర్వాయర్ ను చేరుకునే క్రమంలో నిత్యమూ ఎంతో రద్దీగా ఉండే రాజీవ్ రహదారిని దాటాల్సి వుంటుంది. ఎవరికీ కనిపించకుండా అది రహదారిని ఎలా దాటిందన్న విషయం మాత్రం అంతు చిక్కడం లేదు.